ఆ 13 మందికి ఒమిక్రాన్ నెగిటివ్: మంత్రి హరీశ్ రావు

harish rao

రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ వేగం మరింత పెంచాలని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. కొత్త వేరియంట్, కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్ పై సోమవారం బి అర్ కే భవన్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, హెల్త్ సెక్రెటరీ రిజ్వీ, డిఎంఇ రమేష్ రెడ్డి డి హెచ్ శ్రీనివాస రావు, కాళోజీ వర్సిటీ వీసీ కరుణాకర్ రెడ్డి, సిఎం ఓఎస్డీ గంగాధర్, ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్బంగా అధికారులు కరోనా కేసులు, ఒమిక్రాన్ వ్యాప్తి చెందకుండా తీసుకుంటున్న చర్యలు, వాక్సినేషన్ గురించి వివరించారు. రిస్క్ దేశాల నుండి రాష్ట్రానికి 1805 మంది వచ్చారని, పాజిటివ్ వచ్చిన 13 మందికి  ఒమిక్రాన్ నెగిటివ్ నిర్ధారణ అయినట్లు వివరించారు.

వ్యాక్సినేషన్ వేగం మరింత పెంచాలని, ముఖ్యంగా రెండో డోసు పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రతి ఒక్కరూ రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవాలని, అప్పుడే పూర్తి స్థాయి రక్షణ లభిస్తుందని అన్నారు.

రెండో డోసు తీసుకోవడంలో నిర్లక్ష్యం చూపవద్దని, ఇతర వేరియంట్లను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎలాంటి పరిస్థితులను అయినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో 27 వేల పడకలు ఉన్నాయని పేర్కొన్నారు.

ప్రజలు తమ వంతు బాధ్యతగా జాగ్రత్తలు పాటిస్తూ, ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని, కోవిడ్ నిబంధనలు తప్పక పాటించాలని సూచించారు. మాస్కులు ధరించడం, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, భౌతిక దూరం పాటించడం వంటివి ప్రతి ఒక్కరు చేయాలని సూచించారు.