ముగ్గురు పోలీసులను కాల్చిచంపిన వేటగాళ్లు

కూంబింగ్‎కు వెళ్లిన పోలీసులపై వేటగాళ్లు విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులు తమ ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‎లోని గుణ జిల్లాలో జరిగింది. అరోన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీప్రాంతంలో కొంతమంది వేటగాళ్లు కృష్ణజింకలను వేటాడుతున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు కూంబింగ్ కు వెళ్లారు. అది గమనించిన వేటగాళ్లు.. పోలీసులపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సబ్-ఇన్‌స్పెక్టర్ రాజ్‌కుమార్ జాతవ్, హెడ్ కానిస్టేబుల్ సంత్ కుమార్ మినా, కానిస్టేబుల్ నీరజ్ భార్గవ్ మరణించారు.

కాల్పుల ఘటనపై గుణ పోలీసు సూపరింటెండెంట్ రాజీవ్ మిశ్రా స్పందించారు. సాయుధులైన వేటగాళ్లు తుపాకులతో పోలీసులపై దాడికి దిగారు. ఈ దాడిలో ముగ్గురు పోలీసులు చనిపోగా.. డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. దట్టమైన ఆకులను ఉపయోగించుకుని వేటగాళ్లు తప్పించుకోగలిగారు. అటవీ ప్రాంతం నుంచి పలు కృష్ణజింకల శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నాం’ అని ఆయన తెలిపారు.

ముగ్గురు పోలీసు సిబ్బంది మృతి పట్ల రాష్ట్ర హోంమంత్రి నరోత్తం మిశ్రా సంతాపం తెలుపుతూ.. నేరస్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై చర్చించేందుకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తన నివాసంలో ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి నరోత్తమ్ మిశ్రా, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సుధీర్ సక్సేనా, ఇతర పోలీసు ఉన్నతాధికారులు, గుణ యంత్రాంగం హాజరుకానున్నారు.