ఎండ వేడికి బస్ ట్యాంకులో పేలుడు.. నలుగురు మృతి

జమ్మూకశ్మీర్ లోని కత్రాలో బస్సులో మంటలు చెలరేగి నలుగురు మృతిచెందగా.. మరో 22 మంది గాయపడ్డారు. బస్సు కత్రా నుంచి జమ్మూకి వెళ్తుండగా ఖర్మల్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.. బస్సు ఇంజిన్ నుంచి మంటలు రేగి.. బస్సును మొత్తం వ్యాపించాయి. దాంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోగా.. మరో ఇద్దరు ఆస్పత్రికి తీసుకెళ్తుండగా చనిపోయారు. ఈ ప్రమాదంలో 20 మందికి పైగా గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.

ఈ ఘటనపై జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తన ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ‘కత్రాలో జరిగిన బస్సు ప్రమాద ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’ అని గవర్నర్ అన్నారు. క్షతగాత్రులకు సాధ్యమైనంత మెరుగైన చికిత్స అందించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆయన ఆదేశించారు.

బస్సు ప్రమాదం తర్వాత, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ.. క్షతగాత్రులను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కాగా.. డిప్యూటీ కమిషనర్ బాబిలా రక్వాల్, రియాసి, జమ్మూ & కాశ్మీర్ మాట్లాడుతూ.. బస్సులో పేలుడు సంభవించలేదని స్పష్టంచేశారు. ఎండ ఎక్కువగా ఉండటం వల్ల డీజిల్ ట్యాంక్ వేడెక్కి.. మంటలు వచ్చాయని, బస్సును మంటలు వ్యాపించడంతో నలుగురు మరణించారని ఆయన తెలిపారు.