4000 పల్లె దవాఖానలు ఏర్పాటు: మంత్రి హరీశ్ రావు

Harish Rao

శ్రీ షిర్డీ సాయి జన మంగళం ట్రస్ట్ అధ్వర్యంలో ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం, నారాయణపురంలో ఏర్పాటు చేస్తున్న 250 పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రాజెక్ట్ ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. హైదరాబాద్ లోని ద పార్క్ హోటల్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి హరీశ్ రావు, చంద్ర భాను సత్పథి, డి అర్ డి ఓ ఛైర్మెన్ సతీష్ రెడ్డి, జస్టిస్ నవీన్ రెడ్డి,టిటిడి బోర్డు చైర్మన్  వై వి సుబ్బారెడ్డి, సినీ ప్రముఖులు మోహన్ బాబు, ఎంపీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వెంకట వీరయ్య తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ… మారుమూల ప్రాంతంలో ఆసుపత్రి ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చినందుకు ప్రభుత్వం తరుపున, వ్యక్తిగతంగా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు. ఈ తరహా సేవలు ప్రభుత్వం చేస్తే బాధ్యత అని, మిగతా వారు చేస్తే సేవ అని అన్నారు. మానవ సేవే.. మాధవ సేవ.. అన్న మంత్రి హరీశ్ రావు.. సేవా గుణాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ప్రస్తుత కాలంలో వైద్యం ఖరీదైన వ్యవహారం అయ్యిందని, దేశంలో వైద్యం మీద ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు.

తెలంగాణ ఏర్పాటు తర్వాత వైద్య రంగాన్ని ప్రభుత్వం పటిష్టం చేస్తున్నదన్నారు. ఇందులో భాగంగా 5 గా ఉన్న మెడికల్ కాలేజీలను 17 కు పెంచడం జరిగిందన్నారు. మొత్తంగా ఎంబీబీఎస్ సీట్లను 2875కు, పీజీ సీట్లను1200కు దాకా పెంచుకుంటున్నట్లు అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యుల సంఖ్య పెంచాలి అనే ఉద్దేశంతో వైద్య విద్యను అందుబాటులోకి తెస్తున్నామన్నారు.

హైదరాబాద్ లో బస్తీ దావాఖనలు సక్సెస్ కావడంతో గ్రామాల్లో 4000 పల్లె దవాఖానలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రాథమిక దశలో రోగాన్ని గుర్తిస్తే నయం చేయడం సాధ్యమవుతుందన్నారు. వివిధ కారణాల వల్ల పేదలు చేయి దాటే స్థితిలో ఆసుపత్రికి వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. షుగర్, బీపీ వంటి రోగాలు చిన్న వయసులోనే వస్తున్నాయని, ప్రాథమికంగా గుర్తిస్తే.. వ్యాధులు ముదరకుండా అడ్డుకోవడం సాధ్యమవుతుందన్నారు.

పల్లె దవాఖానల ద్వారా ఎంబీబీఎస్ వైద్యుల సేవలు ప్రజలకు చేరువ అవుతాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు చేసేవారికి పీజీ అడ్మిషన్లలో కోటా కల్పించినట్లు చెప్పారు. మారుమూల ప్రాంతంలో ట్రస్ట్ ఏర్పాటు చేస్తున్న ఆసుపత్రికి ప్రభుత్వం తరుపున అన్ని విధాలా మద్దతు ఉంటుందని మంత్రి హరీశ్ రావు తెలిపారు.