బొగ్గుగనిలో ప్రమాదం.. 52మంది మృతి

రష్యాలోని సైబేరియా బొగ్గు గనిలో జరిగిన ప్రమాదంలో 52 మంది ప్రాణాలు కోల్పోయారు. సేజేరియాలోని కెమెరోవోలో ఉన్న బొగ్గు గనిలో గురువారం గ్యాస్‌ లీకై.. భారీ పేలుళ్లు సంభవించాయి ఈ ప్రమాదంలో ఆరుగురు సహాయక సిబ్బంది సహా మొత్తం 52 మంది దుర్మరణం పాలయ్యారని వెల్లడించారు. 820 అడుగుల లోతులో జరిగిన ఈ ప్రమాదం నుంచి 239 మంది ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. మరో 35 మంది ఆచూకీ దొరకడం లేదు. ప్రమాదంలో 44 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని దవాఖానకు తరలించామన్నారు. అందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.


భద్రతా నియమాలు పాటించకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు భావిస్తున్నారు. విధుల్లో నిర్లక్ష్యం కారణంగా మైన్ డైరెక్టర్ సహా ఇద్దరు సీనియర్ అధికారులను పోలీసులు అరెస్టు చేశారు. దుర్ఘటన పట్ల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్ సంతాపం తెలిపారు. గాయపడిన వారికి అన్ని విధాల సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. కెమెరోవో ప్రాంతంలో మూడు రోజులపాటు సంతాప దినాలుగా ప్రకటించారు. గత దశాబ్ద కాలంలో రష్యాలో జరిగిన బొగ్గు గనుల ప్రమాదాల్లో ఇదే అతి పెద్దది.