డీజే సౌండ్ కి గుండె ఆగి.. 63 కోళ్లు మృతి

దుమ్ము రేపే డీజే సౌండ్ వింటే కుర్రకారు కాళ్లు ఆగవు. డీజే సౌండ్ మోగుతుంటే గుండెలు జల్లుమంటుంటాయి. ఈరోజుల్లో పెండ్లి, పేరంటం, వేడుక ఏదైనా డీజే సౌండ్ తో హోరెత్తిస్తున్నారు. తాజాగా ఓ ఇంట్లో జరిగిన పెండ్లిలో డీజే మోతలకు పక్కనే ఉన్న కోళ్లఫామ్ యజమాని తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. పెండ్లి వేడుక జరుగుతున్న ఇంటి సమీపంలో ఉన్న కోళ్లఫామ్ లో కోళ్లు డీజే సౌండ్ భరించలేక గిలగిల కొట్టుకొని చనిపోయాయి. ఈ ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది.


ఒడిశాలోని బాలాసోర్ లో ఓ ఇంట్లో జరిగిన పెండ్లి వేడుకలో డీజే పెట్టి పాటలు ప్లే చేశారు. ఆ సౌండ్ తట్టుకోలేక 63 కోళ్లు గుండె ఆగి చనిపోయాయి. తన కోళ్లు చచ్చిపోవడానికి డీజేనే కారణమని కోళ్లఫామ్ యజమాని రంజిత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంజినీరింగ్ పూర్తి చేసిన రంజిత్ బ్యాంకు లోన్ తీసుకొని కోళ్ల ఫామ్ పెట్టుకొని జీవనం సాగిస్తున్నాడు. కాగా గత ఆదివారం నాడు ఫామ్ సమీపంలో ఉన్న ఓ ఇంట్లో జరిగిన పెండ్లిలో రాత్రి 11:30 నిమిషాలకు చెవులు చిల్లులు పడే సౌండుతో డీజే ప్లే చేశారు. ఆ సౌండ్ కి కోళ్లు కింద పడి గిలగిలా కొట్టుకొని చనిపోయాయని.. సౌండ్ తగ్గించాలని ఎంత బతిమిలాడినా.. వారు వినలేదని.. డీజే కారణంగా మొత్తం 63 కోళ్లు చనిపోయాయని పోలీసుల ఎదుట వాపోయాడు.


తెల్లవారగానే కోళ్లను వెటర్నరీ డాక్టర్ కి చూపిస్తే అవి గుండెపోటుతో చనిపోయాయని చెప్పాడు. మితిమీరిన డీజే శబ్దాల వల్లే తన కోళ్లు చనిపోయాయని తనకు నష్టపరిహారం ఇప్పించాలని అడిగినా.. ఇంటి యజమాని స్పందించలేదని రంజిత్ ఫిర్యాదులో తెలిపాడు. తనకు నష్టపరిహారం అందించి.. వారిపై చర్యలు తీసుకోవాలని, మూగ జీవుల పట్ల బాధ్యత లేనందుకు కఠినంగా శిక్షించాలని కోరాడు.