రైతుబంధు కింద రూ.6663.79 కోట్లు జమ

రైతుబంధు కింద 59.71 లక్షల మంది రైతుల ఖాతాలలో రూ.6663.79 కోట్లు జమ చేసినట్టు రాష్ట్ర వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చెప్పారు. మంగళవారం  2.10 లక్షల మంది రైతుల ఖాతాలలో 13.02 లక్షల ఎకరాలకు గాను రూ.651.07  కోట్లు జమయ్యాయన్నారు. ఇప్పటి వరకు మొత్తం 133.27 లక్షల ఎకరాలకు రైతుబంధు సాయం అందించామన్నారు.

వాతావరణ శాఖ వివరాల ప్రకారం ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం 95.4 ఎంఎం వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 40 శాతం ఎక్కువగా 137.6 ఎంఎం వర్షపాతం నమోదయిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 13 లక్షల క్వింటాళ్ల వివిధ రకాల విత్తనాలు అవసరం ఉండగా ప్రణాళిక ప్రకారం అన్ని రకాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని వ్యవసాయ మంత్రి చెప్పారు.

సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు రూ.61.52 కోట్ల విలువగల పచ్చిరొట్ట విత్తనాలయిన జీలుగ, పిల్లిపెసర, జనము విత్తనాలు 65 శాతం సబ్సిడీపై అందిస్తున్నామని చెప్పారు. దాదాపు 14 లక్షల ఎకరాలకు ఈ విత్తనాలు సరిపోతాయని.. నేల సారం పెంచేందుకు దోహదపడతాయని మంత్రి అన్నారు.

4.41 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాతో పాటు మొత్తం 8.64  లక్షల మెట్రిక్ టన్నుల వివిధ ఎరువులు ఈ రోజు వరకు అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. రాష్ట్రంలో ఈ రోజు వరకు 18.88 లక్షల ఎకరాలలో సాగు మొదలయిందని, ప్రధానపంట అయిన పత్తి 14.82 లక్షల ఎకరాలలో, కంది 1.58 లక్షల ఎకరాలలో సాగు చేయడం జరిగిందని మంత్రి వివరించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రైతాంగానికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వ్యవసాయ శాఖ అన్నీ రకాల చర్యలు తీసుకుంటుందని మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారు.