వ్యాక్సినేషన్ ఈవెంట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన నవ వధువు

a new bride as the special attraction at the vaccination event, in hyderabad

కరోనా వైరస్ అరిక‌ట్ట‌డానికి సైబరాబాద్ పోలీసులు చేపట్టిన మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్‌.. విజయవంతంగా ముగిసింది. కొన్ని గంటల వ్యవధిలో 40 వేల మందికి పైగా వ్యాక్సిన్లు వేశారు అక్కడి డాక్టర్లు..నర్సులు. హైద‌రాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్‌‌ గ్రౌండ్స్ లో ఆదివారం ఉదయం 8 గంటకు ప్రారంభమైన ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ రాత్రి వరకూ నిరంతరాయంగా కొనసాగింది. 18 సంవత్సరాలకు పైనున్న వయస్సు గల వారికి టీకాలను వేశారు. సైబరాబాద్ పోలీసులు, సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌, మెడికవర్ ఆసుపత్రి సంయుక్తంగా దీన్ని నిర్వహించాయి.

ఈ మెగా వ్యాక్సినేషన్ ఈవెంట్‌లో ఓ నవ వధువు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పెళ్లి పీటలు ఎక్కడానికి గంట ముందు.. పెళ్లి దుస్తుల్లో హైటెక్స్ గ్రౌండ్స్‌కు చేరుకొని.. వ్యాక్సిన్ వేసుకున్నారు. నర్సులు ఆ నవ వధువుకు వ్యాక్సిన్ వేశారు. అనంతరం ఆమెతో ఫొటోలు దిగారు. వ్యాక్సిన్ వేసుకున్న తరువాత.. పెద్దగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కనిపించలేదని, టీకా వేయించుకోవడం ఎగ్జయిటింగ్‌గా అనిపించిందని ఆ వధువు వ్యాఖ్యానించారు. టీకా వేయించుకోవడానికి తన తల్లిదండ్రులు, వరుడి తరఫు కుటుంబ సభ్యులు అంగీకరించారని చెప్పారు.