చంద్రయాన్‌-2 వ్యోమనౌకకు తప్పిన ప్రమాదం

accident Missed to Chandrayaan-2 spacecraft

భారత్‌కు చెందిన చంద్రయాన్‌-2 వ్యోమనౌకకు భారీ ప్రమాదం తప్పింది. చంద్రుడి ఉత్తర ధ్రువానికి సమీపంలో చంద్రయాన్‌-2 వ్యోమనౌక, నాసాకు చెందిన ‘లూనార్‌ రికానసన్స్‌ ఆర్బిటర్‌ (ఎల్‌ఆర్‌వో)’ పరస్పరం ఢీకొట్టుకునే అంతగా దగ్గరకు వచ్చాయి.

ఈ నేపథ్యంలో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) తో కలిసి ‘కొలిజన్‌ అవాయిడెన్స్‌ మెనూవర్‌ (క్యామ్‌)’ విన్యాసాన్ని విజయవంతంగా చేపట్టడం ద్వారా ఆ ప్రమాదాన్ని తప్పించినట్లు అప్రమత్తమైన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వెల్లడించింది.

accident Missed to Chandrayaan-2 spacecraft

ఈ ఏడాది అక్టోబరు 20న ఉత్తర ధ్రువానికి సమీపంలో చంద్రయాన్‌-2 వ్యోమనౌక, ఎల్‌ఆర్‌వో రెండూ ప్రమాదకర రీతిలోపరస్పరం సమీపంలోకి రానున్నట్లు శాస్త్రవేత్తలు ముందే గుర్తించారు. ఓ దశలో వాటి మధ్య దూరం 100 మీటర్ల కంటే తక్కువకు తగ్గుతుందని అంచనా వేశారు. అవి పరస్పరం ఢీ కొట్టుకోకుండా ఉండేందుకు క్యామ్‌ విన్యాసం చేపట్టాలని ఇస్రో, నాసా నిర్ణయించాయి.

అక్టోబరు 18న చంద్రయాన్‌-2కు ఈ క్యామ్ విన్యాసాన్ని నిర్వహించారు. అది విజయవంతం కావడంతో అవి ఢీకొట్టుకునే ముప్పు తొలగిపోయింది. తాము ప్రయోగించిన వ్యోమనౌకకు ఇలాంటి పరిస్థితి ఎదురవడం మాత్రం ఇదే తొలిసారి అని ఇస్రో పేర్కొంది. అంతరిక్షంలోని వస్తువులు, వ్యర్థాలతో ఢీ కొట్టే ముప్పును తొలగించేందుకుగాను భూ కక్ష్యలోని ఉపగ్రహాలకు క్యామ్‌ విన్యాసం చేపడతారని ఇస్రో తెలిపింది.