దేశ్ కి నేత కేసీఆర్‌ తో అఖిలేష్‌ భేటీ.. చర్చంతా దానిపైనే

akhilesh yadav to meet cm kcr
akhilesh yadav to meet cm kcr

జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తూ దూకుడు పెంచారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. దేశానికి ప్రత్యామ్నాయ ఎజెండానే ద్యేయంగా ముందుకు కదులుతున్నారు కేసీఆర్. ఈ నేపథ్యంలో తాజాగా ఢిల్లీ టూర్ చేపట్టారు గులాబీ బాస్. ఈ నెల 30 వరకు వివిధ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. తన పర్యటనలో భాగంగా.. ఆర్థిక వేత్తలు, రాజకీయ, మీడియా రంగ ప్రముఖులతో కేసీఆర్ భేటీ కానున్నారు. ప్రత్యామ్నాయ ఎజెండా రూపకల్పనపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కేసీఆర్ నేడు యూపీ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌తో సమావేశం కానున్నారు. ఢిల్లీలోనే ఇరువురు నేతల మధ్య భేటీ జరగనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రాంతీయ పార్టీల ఐక్యవేదిక గురించి ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం.

ఇక ఈ పర్యటన కోసం శుక్రవారం సాయంత్రం సీఎం కేసీఆర్ హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్నారు. కేసీఆర్ వెంట ఎంపీలు సంతోష్ కుమార్, రంజిత్ రెడ్డి,  రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ఉన్నారు. ఇక సీఎం కేసీఆర్ మే 22న చండీఘర్ లో పర్యటించనున్నారని.. వివాదాస్పద సాగు చట్టాలకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో మరణించిన పంజాబ్, హర్యానా,ఉత్తరప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాలకు చెందిన 600 మంది రైతుల కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా అందిస్తారని టీఆర్ఎస్ పార్టీ వర్గాలు తెలిపాయి.