ఆసియా హ్యాండ్‌బాల్ విజేత అల్‌-కువైట్

  • ఫైన‌ల్‌లో 28-23తో అల్‌-న‌జ్మాపై గెలుపు
  • మూడో స్థానం మ్యాచ్‌లో నెగ్గిన ఖ‌ద్సియా క్ల‌బ్‌ (కువైట్‌)

హైద‌రాబాద్‌: ఆసియా హ్యాండ్‌బాల్ పురుషుల క్ల‌బ్ లీగ్ 24వ‌ చాంపియ‌న్‌షిప్ టైటిల్‌ను అల్‌-కువైట్ క్ల‌బ్ కైవసం చేసుకుంది. గురువారం జ‌రిగిన హైఓల్టేజ్ ఫైన‌ల్‌లో అల్‌-కువైట్ 28-23తో అల్‌-న‌జ్మా (బ‌హ్రెయిన్‌)ను ఓడించి ట్రోఫీని ముద్దాడింది. హైద‌రాబాద్‌లోని గ‌చ్చిబౌలి జీఎంసీ బాల‌యోగి స్టేడియం జ‌రిగిన ఈ ఉత్కంఠ‌భ‌రిత మ్యాచ్‌లో ఇరు జ‌ట్లు విజ‌యంకోసం స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డాయి. మ్యాచ్ చివ‌రి ఐదు నిమిషాలు వ‌ర‌కు గ‌ట్టి పోటీ ఇచ్చిన అల్-న‌జ్మా ఆఖ‌ర్లో ఒత్తిడికి చిత్త‌యి ట్రోఫీ చేజార్చుకుంది.

ఆట ప్రారంభ‌మైన రెండో నిమిషంలోనే అల్‌-న‌జ్మా అటాక‌ర్ హ‌బీబ్ అద్భుత‌మైన గోల్‌తో స్కోరు బోర్డు ఖాతా తెరిచాడు. మ్యాచ్ ప్రారంభం నుంచి పోటా పోటీగా చెరో గోల్ చేస్తూ ఇరు జ‌ట్లు హోరాహోరీగా త‌ల‌ప‌డ్డాయి. తొలి అర్ధ భాగం మ‌రో మూడో నిమిషాల్లో ముగిస్తుంద‌న‌గా కువైట్ అటాక‌ర్లు ఏంజిల్‌, ఫ్రాంకిస్ మెరుపు గోల్స్ చేసి ఆ జ‌ట్టును ఆధిక్యంలో నిలిపారు. దీంతో కువైట్ 15-11తో తొలి అర్ధ‌భాగాన్ని ముగించింది. ఇక‌, విరామం త‌ర్వాత గేర్ మార్చిన అల్‌-న‌జ్మా..కువైట్ స్కోరును స‌మం చేసేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నించింది.

రెండో అర్ధ‌భాగం 10 నిమిషాల ఆట ముగిసేస‌రికి కువైట్ ఆధిక్యాన్ని న‌జ్మా రెండు పాయింట్ల‌కు త‌గ్గించి 18-20తో గ‌ట్టి పోటీ ఇచ్చింది.  ఆట 24వ నిమిషం వ‌ర‌కు పాయింట్ల కోసం ఇరు జ‌ట్లు కొద‌మ సింహాల్లా త‌ల‌ప‌డ్డాయి. ఆట 25వ నిమిషానికి న‌జ్మా 22-24తో రెండు పాయింట్ల వెనుకంజ‌లో నిలిచింది. ఈ ద‌శ‌లో కువైట్ ఒక్క‌సారిగా జూలు విదిల్చింది. మ‌రోసారి ఆ జ‌ట్టు స్టార్ ప్లేయ‌ర్లు ఏంజిల్, అల్ హ‌బి చెరో రెండు గోల్స్‌తో మెర‌వ‌డంతో ఒక్క‌సారిగా స‌మీక‌ర‌ణాలు మారిపోయాయి.

కువైట్ 26-22తో స్ప‌ష్ట‌మైన ఆధిప‌త్యాన్ని సాధించింది. స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డ‌డం, పాయింట్ల అంత‌రం పెర‌గ‌డంతో అల్‌-న‌జ్మా త‌డ‌బ‌డి చివ‌ర్లో చేతులెత్తేసింది. దీంతో కువైట్ 28-23 స్కోరుతో ప్ర‌త్య‌ర్థి న‌జ్మాపై గెలుపొంది చాంపియ‌న్‌గా నిలిచింది. ఇక‌, అంత‌కుముందు మూడో స్థానం కోసం ఆద్యంతం ఉత్కంఠ‌గా జ‌రిగిన మ్యాచ్‌లో అల్-ఖ‌ద్సియా (కువైట్‌) 28-27తో అల్‌-అర‌బీ (ఖ‌తార్‌)పై నెగ్గి రెండో ర‌న్న‌ర‌ప్‌గా నిలిచింది.

రాష్ట్ర ఐటీ శాఖ ప్రిన్సిస‌ల్ సెక్ర‌ట‌రీ జ‌యేష్ రంజ‌న్‌, యువ‌జ‌న స‌ర్వీసులు, క్రీడ‌ల శాఖ సెక్ర‌ట‌రీ సందీప్ సుల్తానియా, అంత‌ర్జాతీయ హ్యాండ్‌బాల్ సంఘం ఉపాధ్య‌క్షుడు బ‌ద‌ర్ అల్ తీయాబ్‌, జాతీయ హ్యాండ్‌బాల్ సంఘం అధ్య‌క్షుడు అర్శ‌న‌ప‌ల్లి జ‌గ‌న్ మోహ‌న్‌రావు, శాట్స్ చైర్మ‌న్ వెంక‌టేశ్వ‌ర్ రెడ్డి, భార‌త ఒలింపిక్ సంఘం కోశాధికారి ఆనందీశ్వ‌ర్ పాండే క‌లిసి విజేత జ‌ట్టుకు ట్రోఫీ బ‌హూక‌రించారు. ముగింపు వేడుక‌ల్లో తెలంగాణ ఒలింపిక్ సంఘం కార్య‌ద‌ర్శి జ‌గ‌దీష్ యాద‌వ్‌, రాష్ట్ర హ్యాండ్‌భాల్ సంఘం ప్ర‌తినిధులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

రాష్ట్ర ప్ర‌భుత్వానికి ధ‌న్య‌వాదాలు: జ‌గ‌న్ మోహ‌న్‌రావు

ఆసియా హ్యాండ్‌బాల్ పోటీలకు ఆతిథ్యమిచ్చే అవ‌కాశం న‌గ‌రానికి ద‌క్క‌గానే ఆ విష‌యాన్ని రాష్ట్ర ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రివ‌ర్యులు కేటీఆర్‌, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు తెలియ‌జేశాన‌ని వారి ఈవెంట్ ప్రారంభం నుంచి ఇప్ప‌టివ‌ర‌కు పూర్తి స‌హాయ స‌హ‌కారాలందించార‌ని జ‌గ‌న్ మోహ‌న్‌రావు చెప్పారు. ఇంత‌టి మెగా ఈవెంట్ విజ‌య‌వంతమ‌వ‌డానికి కృషి చేసిన సాయ్‌, శాట్స్ అధికారుల‌కు, రాష్ట్ర హ్యాండ్‌బాల్ సంఘం ప్ర‌తినిధుల‌కు ప్ర‌త్యేకంగా ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఇది ఆరంభం మాత్ర‌మేన‌ని సీఎం కేసీఆర్, కేటీఆర్‌ నాయ‌క‌త్వంలో త్వ‌ర‌లో రాష్ట్రంలో పెద్ద స్పోర్ట్స్ ఫెస్టివ‌ల్‌ను నిర్వ‌హించేందుకు ఆలోచ‌న చేస్తున్నామ‌ని జ‌గ‌న్ మోహ‌న్‌రావు చెప్పారు.

మెట్రోలో వ‌చ్చిన జ‌యేష్ రంజ‌న్‌

ఈ పోటీల‌కు ముఖ్య అతిథిగా హాజ‌రైన రాష్ట్ర ఐటీశాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ జ‌యేష్ రంజ‌న్ ట్రాఫిక్ స‌మ‌స్య‌ను అధిగ‌మించ‌డానికి మెట్రోలో ప్ర‌యాణం చేసి గ‌చ్చిబౌలి స్టేడియానికి చేరుకున్నారు. అసెంబ్లీ మెట్రో స్టేష‌న్ నుంచి రాయ‌దుర్గం స్టేష‌న్ వ‌ర‌కు ఒక్క‌రే ప్ర‌యాణించి, అక్క‌డి నుంచి కారులో గ‌చ్చిబౌలి ఇండోర్ స్టేడియంకు విచ్చేశారు. క్రీడ‌లపై ఉన్న అభిమాన‌మే త‌న‌ని ఇక్క‌డికి ర‌ప్పించింద‌ని జ‌యేష్ రంజ‌న్ చెప్పారు.