మేడారం సమ్మక్క సారక్క జాతరకు అన్ని ఏర్పాట్లు సిద్ధం : మంత్రి స‌త్య‌వ‌తి

All arrangements have been made for the Medaram Sammakka Sarakka Jatara: Minister Satyavati

చారిత్రాత్మక మేడారం సమ్మక్క సారక్క జాతరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు. ఈసారి జరిగే జాతరలో టెక్నాల‌జీని మరింతగా ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. సమ్మక్క సారక్క జాతరపై శాసనమండలి సమావేశ మందిరంలో మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. మేడారం జాతరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఫిబ్రవరి 18వ తేదీన వస్తారనే సమాచారం ఉందని మంత్రి పేర్కొన్నారు.

. కరోనా కారణంగా భక్తులు ముందుస్తు దర్శనం కోసం భారీగా తరలి వస్తున్నారని పేర్కొన్నారు. మేడారం జాతరకు రోజుకు 3లక్షల వరకు భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. జంపన్నవాగు విషయంలో కొంత విమర్శలు వచ్చాయని.. ఇప్పుడు ఎలాంటి ఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేసినట్లు మంత్రి స్పష్టం చేశారు. జాతరలో మెడికల్ శిబిరాలు, మాస్కులు పంపిణీ చేస్తున్నామన్నారు. షిప్ట్‌వైజ్​గా దర్శనం చేసుకోవడానికి ఏర్పాట్లు చేయబోతున్నట్లు తెలిపారు. జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం బయోటాయిలెట్లు- రెగ్యులర్ టాయిలెల్స్‌ అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. భక్తులు గంటలపాటు క్యూ లైన్లలో నిల్చోకుండా అర గంటలో దర్శనం అయ్యే విధంగా ఏర్పాట్లు చేయబోతున్నట్లు వెల్లడించారు. వీఐపీ పాస్​పై టైమింగ్ స్లాట్‌ ఇవ్వబోతున్నట్లు తెలిపారు.

సమ్మక్క జాతరకు కేంద్రం నుంచి ఎలాంటి నిధులు రాలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా కేంద్రాన్ని అడుగుతున్నామని తెలిపారు. జాతర సందర్భంగా ఎకరానికి 6 వేల చొప్పున రైతులకు నిధులు ఇస్తున్నామని.. ఇలా మొత్తం 1100 ఎకరాలకు ఇస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. జాతరకు దగ్గరలో భూమి కొనేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేసిందన్నారు. జాతరకు వచ్చే భక్తుల దాదాపు 8 వేల బస్సులను అందుబాటులో ఉంచుతున్నామన్నారు.