వచ్చే విద్యా సంవత్సరం(2022-23)లో ఒకటి నుంచి పదో తరగతి వరకు ఒకేసారి ఇంగ్లీష్ మీడియాన్ని ప్రారంభిస్తామని విద్యాశాఖ సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారని చెప్పారు. మొదటి తరగతి నుంచి ప్రారంభించుకుంటూ వెళ్లాలంటే పదో తరగతికి వచ్చేసరికి పదేళ్లు పడుతుందని మంత్రి వ్యాఖ్యానించారు. తన కార్యాలయంలో బుధవారం సాయంత్రం విలేకర్లతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. రాష్ట్రంలో 26 వేల ప్రభుత్వ పాఠశాలలు ఉండగా అందులో దాదాపు 10 లక్షల మంది ఇప్పటికే ఆంగ్ల మాధ్యమంలో చదువుకుంటున్నారని చెప్పారు. వచ్చే ఏడాది అన్ని బడుల్లో ఆంగ్ల మాధ్యమాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించిందని, అయితే తెలుగు మాధ్యమం ఆప్షన్ కూడా ఉంటుందని చెప్పారు. ఎవరికి ఆసక్తి ఉన్న మాధ్యమంలో వారు చదువుకోవచ్చన్నారు. ఒకటి నుంచి ఏడో తరగతి వరకు పాఠ్య పుస్తకాలను రెండు భాషల్లో ముద్రిస్తామని, ఒకవైపు తెలుగు, మరోవైపు ఇంగ్లీష్ మీడియంలో ఉండేలా చూస్తామన్నారు.