అమర్నాథ్ యాత్ర జూన్ 30 నుంచి ప్రారంభం కానుంది. దాదాపు రెండేళ్ల తర్వాత అమర్నాథ్ యాత్ర చేపడుతుండటంతో గట్టి భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. కేంద్ర హోం శాఖ సెక్రటరీ అజయ్ భల్లా నేతృత్వంలో అమర్నాథ్ యాత్రపై ఇవాళ సమీక్ష జరిగింది. యాత్ర ఏర్పాట్లు, భక్తుల భద్రతపై చర్చించారు.
అమర్నాథ్ యాత్రపై తీవ్రవాదులు గురిపెట్టారన్న వార్తల నేపథ్యంలో భక్తుల భద్రత గురించి సమీక్షించారు. ఇప్పటికే ఈ యాత్రకు స్థానిక పోలీసులతో కలిసి పనిచేసేలా 120 కంపెనీల బలగాలను కేంద్రం కేటాయించింది. వీరితోపాటు యాత్ర మార్గంలో డ్రోన్లతో కూడా నిఘా ఏర్పాటు చేయనున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా ఈసారి యాత్రికులకు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్ఎఫ్ఐడీ) ఇవ్వనున్నారు.
కోవిడ్ నేపథ్యంలో గత రెండేళ్లుగా అమర్నాథ్ యాత్ర జరగలేదు. దీంతో ఈసారి భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ లోయలో హిందువులపై దాడులు పెరిగిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమర్నాథ్ యాత్రకు భారీ భద్రతను కల్పించనున్నారు.