చెన్నై టీమ్ టాప్ కీలక బ్యాట్స్ మన్ అంబటి రాయుడు ఒక్క ట్వీట్‌తో గందరగోళానికి గురిచేశాడు. ఇదే తనకు చివరి టీ20 లీగ్ అని, వచ్చే ఏడాది నుంచి ఈ మెగా ఈవెంట్లో ఆడనని.. ఈ మధ్యాహ్నం రాయుడు ఒక ఆసక్తికర ట్వీట్ చేసి వెంటనే దాన్ని తొలగించాడు.
ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మెగా టోర్నీలో ఆడేందుకు అవకాశాలు ఇచ్చిన ముంబయి, చెన్నై జట్లకు కృతజ్ఞతలు కూడా తెలిపాడు. కొద్ది క్షణాల్లోనే ఆ ట్వీట్ వైరల్‌గా మారడంతో కాసేపటికే రాయుడు ఆ ట్వీట్‌ను తొలగించాడు.
దీంతో రాయుడు ఏం చెప్పాలనుకున్నాడో అర్థం గాక.. క్రికెట్ అభిమానులు గందరగోళానికి గురవుతున్నారు. దీనిపై చెన్నై జట్టు సీఈఓ విశ్వనాథ్ స్పందించారు. రాయుడితో మాట్లాడినట్లు తెలిపారు. రాయుడు రిటైర్ అవ్వట్లేదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ సీజన్లో అతడు తన ఆటతీరుతో అసంతృప్తిగా ఉన్నాడని, అందువల్ల పొరబాటుగా ఆ ట్వీట్ చేసి ఉంటాడని విషయాన్ని తేలిక చేసే ప్రయత్నం చేశారు.
ఇలా రిటైర్ మెంట్ ప్రకటించి తర్వాత వెనక్కు తీసుకోవడం రాయుడికి ఇది తొలిసారి కాదు. గతంలోనూ ఓ సారి ఇలాగే చేసి వార్తల్లో నిలిచారు. 2019లో ప్రపంచకప్ జట్టుకు రాయుడును ఎంపిక చేయకపోవడంతో అతడు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే ఆ తర్వాత తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు ప్రకటించారు.