బీజేపోళ్లు టైంపాస్ కు పాదయాత్ర చేస్తున్నరు

పాదయాత్ర అనేది బీజేపీ పార్టీకి టైపాస్ లాంటిదని.. పదే పదే సీఎం కేసీఆర్ ను తిట్టడానికే బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారని అందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ బీజేపీ పాదయాత్రపై మండిపడ్డారు. సంగారెడ్డి జిల్లా అందోల్ క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

వర్షాలకు అస్తవ్యస్తమైన రోడ్లకు కేంద్ర ప్రభుత్వం ఎన్ని డబ్బులు ఇస్తాదో చెప్పాలని సవాల్ చేశాడు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో అభివృద్ధి ఎందుకు కావడం లేదు. కేంద్ర మంత్రులే కేసిఆర్ పాలనపై కితాబు ఇస్తుంటే.. బండి సంజయ్ అబద్ధపు ఆరోపణలు చేస్తున్నారు. మూడు రోజుల్లో 20 కిలోమీటర్ల పాదయాత్ర.. బండి సంజయ్ తోటే సాధ్యమైతదని సెటైర్ వేశాడు.

ఉద్యోగాలు ఇవ్వలేదని బండి సంజయ్.. పదే పదే ఆరోపణలు చేస్తున్నాడు. ఇప్పటి వరకు లక్ష యాబై వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు కేటీఆర్  శ్వేతపత్రం విడుదల చేసిన విషయాన్ని గుర్తుచేశాడు. ప్రజా సమస్యలు తెలుసుకోవాల్సిన పాదయాత్ర.. వైభోగాలు చేస్తూ కొనసాగుతుందని ఎద్దేవా చేశాడు.

2002 లో కేసీఆర్ 55 ఏళ్ల వయస్సులో 50 కిలోమీటర్ల పాదయాత్ర చేసిండు. బండిలా జాతీయ రహదారులపై కాకుండా గ్రామాల్లో సమస్యలను తెలుసుకునేలా కేసీఆర్ పాదయాత్ర  చేశాడని గుర్తు చేశాడు.  పార్టీలో ఉన్న అంతర్గత సమస్యలను తెలుసుకునేందుకే పాదయాత్ర చేస్తున్నట్టు ఉందన్నాడు.

పాదయాత్రలో బండి మాట్లాడుతూనన్న మాటలు ప్రజస్వామ్యనికి గొడ్డలి పెట్టులా ఉన్నాయన్నాడు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో వైకుంఠ దామలు, డంపు యార్డులు ఎందుకు లేవని ప్రశ్నించాడు. అందోల్ జోగిపేట జాతీయ రహదారి కేంద్ర ప్రభుత్వం కిందకు వస్తుందన్న విషయం తెలియదా.. మీకు సోయి ఉంటే ఎందుకు బాగుచేయలేదంటూ బండిపై విరుచుపడ్డాడు.