సౌతాఫ్రికాలో బయటపడ్డ మరో కొత్త వేరియంట్‌.. డబ్ల్యూహెచ్ఓ ఆందోళన

Corona new variant

ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ కొనసాగుతున్నా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండడం అందరినీ ఆందోళనకు గురిచేస్తుంది. ప్రపంచంలోని పలు దేశాలపై తన ప్రతాపం చూపిస్తోంది. చైనాతో పాటు బ్రిటన్‌, రష్యా, ఉక్రెయిన్‌ తోపాటు పలు దేశాల్లో రోజువారీ కొవిడ్‌ కేసులు, మరణాలు పెరుగుతున్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలను బలిగొన్న కరోనా వైరస్‌.. తరచూ రూపాంతరం చెందుతూ కొత్త వేరియంట్ గా మారి బలం పెంచుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో కరోనా కొత్త వేరియంట్‌(బి.1.1. 529)ను దక్షిణాఫ్రికా శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. సౌతాఫ్రికాతో పాటు బోట్సువానా, హాంకాంగ్ లో కూడా ఈ కొత్త రకం వైరస్‌ కేసులు బయటపడ్డాయి.

కొత్త వేరియంట్ లో ఏకంగా 32 ఉత్పరివర్తనాలను గుర్తించామని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ కమ్యూనికేబుల్‌ డిసీజెస్‌ (NICD) సైంటిస్టులు తెలిపారు. ఇన్ని మ్యుటేషన్లు ఉన్న ఈ వైరస్‌ను ఇప్పుడున్న వ్యాక్సిన్లు ఏమేరకు అడ్డుకుంటాయన్నది అనుమానమే. అయితే ఇప్పటివరకు బి.1.1. 529 వేరియంట్ కారణంగా కేవలం 22 కేసులు మాత్రమే నమోదు కావడం కాస్తా ఊరటనిచ్చే అంశం.  ప్రపంచాన్ని గడగడలాడించిన బీటా రకం కరోనా వేరియంట్‌ తొలుత దక్షిణాఫ్రికాలోనే బయటపడిన విషయం తెలిసిందే.

కొత్త వేరియంట్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి ఈ వైరస్‌ సోకితే కోలుకోవడం కష్టమని చెప్పింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు కూడా చాలా తక్కువ ప్రభావం చూపుతాయని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది.