ముంబై ఆర్థర్‌ రోడ్‌ జైలు నుంచి విడుదలైన ఆర్యన్ ఖాన్‌

aryan khan

aryan khan

క్రూజ్‌ నౌక డ్రగ్స్‌ కేసులో అరెస్టయిన ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుక్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ ఎట్టకేలకు 27 రోజుల తర్వాత జైలు నుంచి విడుదలయ్యాడు. ఆర్యన్ కు గురువారమే బెయిల్‌ వచ్చినప్పటికీ.. విడుదల ప్రక్రియలో జాప్యం చోటు చేసుకుంది. కుమారుడిని ఇంటికి తీసుకెళ్లేందుకు షారుక్‌.. ఆర్థర్‌ రోడ్‌ జైలుకు వచ్చారు.

ఆర్యన్ కు బాంబే హైకోర్టు గురువారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే బెయిల్ ఉత్తర్వులను జారీ చేయడంలో జాప్యం జరిగింది. దాంతో అవి సకాలంలో జైలుకు చేరలేదు. దీంతో శుక్రవారం రాత్రి కూడా ఆర్యన్ జైల్లో ఉండాల్సి వచ్చింది. ఇవాళ ఉదయం కోర్టు ఉత్తర్వులను పరిశీలించిన జైలు సిబ్బంది.. ఆర్యన్‌ను విడుదల చేశారు.

క్రూయిజ్ డ్రగ్స్‌ కేసులో అక్టోబరు 3న ఆర్యన్‌ను ఎన్‌సీబీ అధికారులు అరెస్టు చేశారు. అక్టోబరు 7న జ్యుడీషియల్‌ కస్టడీ విధించడంతో అతన్ని ఆర్థర్‌ రోడ్‌ జైలుకు తరలించారు. తొలుత ప్రత్యేక న్యాయస్థానంలో బెయిల్ పిటిషన్ వేయగా.. కోర్టు కొట్టివేసింది. దాంతో అక్టోబరు 26న ముంబై హైకోర్టును ఆశ్రయించారు. మూడు రోజులపాటు విచారించిన హైకోర్టు.. గురువారం బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.