అస్సాం వరద ముప్పులో 54.5 లక్షల మంది

ASSAM

అస్సాంలో వరద పరిస్థితి గురువారం రోజు కూడా భయంకరంగానే ఉంది. ఇంకా 54.5 లక్షల మంది వరద ముప్పులోనే వున్నారని.. తాజాగా 12మంది చనిపోయినట్లు అధికారులు తెలిపారు. చాలా జిల్లాల్లో బ్రహ్మపుత్ర, బరాక్‌ నదులు దాని ఉపనదులు పొంగిపొర్లుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం 36 జిల్లాల్లో భూములు ముంపుకు గురయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో వరద ఉధృతి తగ్గినప్పటికిలో రాష్ట్ర వ్యాప్తంగా 276 బోట్ల సహాయంతో NDRF తో పాటు ఇతర ఏజెన్సీలు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. బాధిత ప్రజలకు సహాయక సామగ్రిని పంపిణీ చేయడంలో జిల్లా పాలనా యంత్రాంగానికి సహాయం అందిస్తున్నాయి.

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా సంభవించిన వరదలు 112 రెవిన్యూ సర్కిళ్లు, 4941 గ్రామాలపై ఎఫెక్ట్ చూపాయని.. 2,71,125 మంది ప్రజలు 845 సహాయ శిబిరాల్లో తలదాచుకున్నారని తెలిపారు. వరదల కారణంగా కామ్రూప్‌ జిల్లాలో రెండు కట్టలు తెగిపోవడంతోపాటు 218 రోడ్లు, 20 వంతెనలు దెబ్బతిన్నాయి.