అకాల వర్షం బీభత్సం.. పిడుగు పాటుకు ఐదుగురు మృతి - TNews Telugu

అకాల వర్షం బీభత్సం.. పిడుగు పాటుకు ఐదుగురు మృతి 

atleast Five people were killed with thunderstorm  in joint Medak district

రాష్ట్రంలో పలు జిల్లాల్లో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులు, పిడుగులు, వడగండ్లతో కూడిన వర్షం పలు చోట్ల నష్టాన్ని మిగిల్చింది. పిడుగు పాటుకు పలువురు మృత్యువాత పడ్డారు. మూగ జీవాలు సైతం ప్రాణాలు కోల్పోయాయి. పంటచేలల్లో ధాన్యం రాలిపోగా, కల్లాల్లో ఉంచిన ధాన్యం తడిసి ముద్దయింది. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో పిడుగు పాటుకు ఐదుగురు వ్యక్తులు మరణించారు.

సంగారెడ్డిలోని మనూర్ తండాకు చెందినా కిషన్ నాయక్.. కొమిని బాయి అనే ఇద్దరు దంపతులు.. చేనులో కోత కోసిన జొన్నలను వర్షంలో తడుస్తున్నాయని దాని మీద టార్ఫాలిన్ ప‌ట్టా కప్పడానికి వెళ్లారు. అర్ధరాత్రి పిడుగు ప‌డ‌డంతో దంపతులిద్ద‌రూ అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. వీరికి ముగ్గురు పిల్లలు. దౌల్తాబాద్‌ మండలం ఇందుప్రియాల్‌ గ్రామానికి చెందిన సంబాగ రామయ్య పొలం వద్ద పనులు చేస్తుండగా, వర్షం రావడంతో చెట్టు కిందకు వెళ్లాడు. అదే సమయంలో పిడుగు పడి అక్కడికక్కడే మృతి చెందాడు.

రాయపోలు మండలంలోని మంతూరులో పొలం పనులు చేస్తున్న పట్నం నర్సింహులు పిడుగు పడి మరణించాడు. అలాగే మెదక్‌ జిల్లా చిన్న శంకరంపేటలో పిడుగు పాటుకు ఇటుక బట్టి కార్మికుడు దొగ్రి ఈశ్వర్‌ మృతి చెందాడు. మరో కార్మికుడు సంజయ్‌ అపస్మారక స్థితికి చేరుకోగా, ఆస్పత్రికి తరలించారు.