నోవాక్‌ జకోవిచ్‌కు భారీ షాక్‌

Novak Djokovic

21వ గ్రాండ్‌స్లామ్‌ సాధించాలని కలలుకన్న టెన్నిస్‌ దిగ్గజం, ప్రపంచ నంబర్‌-1 ఆటగాడు నోవాక్‌ జకోవిచ్‌కు భారీ షాక్‌ తగిలింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం తాజాగా మరోసారి అతడి వీసాను రద్దు చేసింది.

ఈ మేరకు ఆ దేశ ఇమ్మిగ్రేషన్‌ మినిస్టర్‌ అలెక్స్‌ హాకే తనకున్న విచక్షణా అధికారం ఉపయోగించి కఠిన నిర్ణయం తీసుకున్నారు. దేశ ప్రజల ఆరోగ్య భద్రత నేపథ్యంలోనే జకోవిచ్‌ వీసాను రద్దు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.

ఆస్ట్రేలియా ఓపెన్‌లో పాల్గొనే అవకాశాలు దాదాపుగా మూసుకుపోయాయని సమాచారం. అలాగే మూడేళ్లు అతడు మళ్లీ ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టేందుకు అవకాశం రాకపోవచ్చని నిపుణులు అంటున్నారు.

జకోవిచ్‌ ఆస్ట్రేలియా ఓపెన్ లో పాల్గొనేందుకు ఈనెల 5న మెల్‌బోర్న్‌ చేరుకున్నాడు. అతడి దగ్గర వాక్సినేషన్‌ సర్టిఫికేట్ లేనందున ఆస్ట్రేలియా బోర్డర్‌ ఫోర్స్‌ అధికారులు అతడిని అడ్డుకొని అతడి వీసాను రద్దు చేసి ఇమ్మిగ్రేషన్‌ డిటెన్షన్‌ సెంటర్‌కు తరలించారు.

తనకు మెడికల్ మినహాయింపులు ఉన్నాయని జకోవిచ్‌ కోర్టుకెక్కాడు. డిసెంబర్‌ 16వ తేదీన తనకు కొవిడ్‌-19 సోకిందని, దీంతో వాక్సినేషన్‌ అవసరం లేదంటూ తన లాయర్ల ద్వారా కోర్టులో వాదనలు వినిపించాడు. ఈ నేపథ్యంలోనే అక్కడి ఫెడరల్‌ కోర్టు జకోవిచ్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది.

కోర్టు ఆదేశాలతో డిటెన్షన్‌ సెంటర్‌ నుంచి బయటకు వచ్చిన జకో.. ప్రాక్టీస్‌ మొదలెట్టిన కొద్ది గంటల్లోనే అతడి వీసాను మంత్రి తన అధికారంతో మళ్లీ రద్దు చేశారు. జనవరి 17 నుంచి ఆస్ట్రేలియా ఓపెన్ ప్రారంభం కానుంది.