భారత్ కు బంగ్లాదేశ్ సాయం తొలిసారి 10వేల రెమిడెసివిర్ ఇంజెక్షన్ల పంపిణి

కరోనాతో సతమతవుతున్న ఇండియాను ప్రపంచ దేశాలు ఆదుకుంటున్నాయి. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కునేందుకు తమవంతు సాయంగా పలు దేశాలు ఔషధాలు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, పీపీఈ కిట్లు తదితర వైద్య సామాగ్రిని భారత్ కు పంపుతున్నాయి. తాజాగా బంగ్లాదేశ్ ఇండియాకు 10వేల రెమిడెసివిర్ ఇంజెక్షన్లను పంపింది. కోవిడ్ బాధితులకు అత్యవసర చికిత్సలో ఈ ఇంజెక్షన్లను వినియోగిస్తున్న విషయం తెలిసిందే. కాగా, బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు తొలిసారిగా  వైద్య సాయం అందింది.

ఈ నేపథ్యంలో సరిహద్దు పోర్టు పెట్రాపోలే వద్ద భారత ప్రభుత్వ ప్రతినిధికి కోల్‌కతాలోని బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషనర్ తౌఫిక్ హసన్ కు గురువారం రెమిడెసివిర్ ఔషదాన్ని అందజేశారు. వరుసగా రెండో రోజూ భారత్‌లో పాజిటివ్ కేసులు 4 లక్షలు దాటగా.. గత 10 రోజుల నుంచి మరణాలు 3వేలకుపైగా చోటుచేసుకుంటున్నాయి. తమ దేశంలో స్థానికంగా ఉత్పత్తి అయిన 10 వేల రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్ల ప్రధాని షేక్ హసినా సూచనలతో బంగ్లాదేశ్ ప్రజల తరఫున భారత్‌‌లోని కోవిడ్ బాధితులకు అందజేస్తున్నామని అక్కడి అధికారులు ప్రకటించారు. కరోనాపై పోరులో భారత్‌కు తమ వంతు సాయం చేస్తామని, అత్యవసర ఔషధాలు, వైద్య సామాగ్రి పంపనున్నట్టు గతవారం బంగ్లాదేశ్ ప్రకటించింది. ఇందులో భాగంగా 10వేల వయల్స్ రెమ్‌డెసివిర్, 30,000 పీపీఈ కిట్లు, వేలాదిగా జింక్, కాల్షియం, విటమిన్ సీ సహా అత్యవసర ఔషధాలు అందజేస్తామని తెలిపింది.

ఈ క్లిష్టమైన సమయంలో బంగ్లాదేశ్ భారత్‌కు సంఘీభావం తెలిపింది.. భారతీయుల ప్రాణాలను కాపాడటానికి సాధ్యమైనంత సహాయాన్ని అందించడానికి, సామాగ్రి సమీకరించడానికి తాము సిద్ధంగా ఉన్నామని, బంగ్లా విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, భారత్‌కు ఇప్పటి వరకూ 40కిపైగా దేశాలు సాయానికి ముందుకొచ్చాయి. ఆక్సిజన్ సంబంధిత పరికరాలు, వైద్య సామాగ్రిని పంపుతున్నాయి.