టీమిండియాకు కొత్త జెర్సీ.. విడుదల చేసిన బీసీసీఐ - TNews Telugu

టీమిండియాకు కొత్త జెర్సీ.. విడుదల చేసిన బీసీసీఐత్వరలో మొదలుకానున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ లో టీమిండియా హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. ఈ క్రమంలో టీమిండియాకు బీసీసీఐ కొత్త జెర్సీ రూపొందించి విడుదల చేసింది. ఈ నెల 18 నుంచి భారత్ కప్ కోసం వేట ప్రారంభించనుంది. కొత్త జెర్సీలు వేసుకొని విరాట్ కొహ్లీ అండ్ టీమ్ ఫొటోలకు ఫోజులిచ్చారు. అక్టోబర్ 17 నుంచి ఈ టోర్నీ మొదలుకానుండగా.. భారత్ 18 నుంచి వార్మప్ మ్యాచ్ లు ఆడనున్నది. కొత్త జెర్సీల ప్రారంబోత్సవంలో పాల్గొన్న కెప్టెన్ విరాట్ కొహ్లీ , రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా లు ఫోటోలకు ఫోజులిచ్చారు.

BCCI Released New Jersey For Team India
BCCI Released New Jersey For Team India

2021 టీ20 టోర్నీ కోసం ఈనెల 13న కొత్త జెర్సీని విడుదల చేయనున్నామని వారంరోజుల క్రితమే బీసీసీఐ ప్రకటించింది. కొత్త జెర్సీ ఎలా ఉండనుందో చూద్దామని.. ఎదురు చూసిన క్రికెట్ అభిమానుల కోసం బీసీసీఐ కొత్త జెర్సీలతో టీమిండియా ఆటగాళ్ల ఫొటోలు విడుదల చేసింది. డార్క్ బ్లూ కలర్ షర్ట్స్ లో నెక్ దగ్గర ఆరెంజ్ కలర్ షేడింగ్ తో జెర్సీ అదిరిపోయింది. కొత్త జెర్సీ 1992 వరల్డ్ కప్ నాటి జెర్సీని పోలి ఉందని పలువురు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. బిలియన్ చీర్స్ జెర్సీ అంటూ బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ లో ఫోటోలను పోస్ట్ చేసింది.


ఈ సిరీస్ లో భారత్ అక్టోబర్ 24న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో తలపడనుంది. దుబాయ్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ కోసం రెండు దేశాల అభిమానులు వెయ్యికళ్లతో ఎదురు చూస్తున్నారు. ఆ తర్వాత అక్టోబర్ 31న న్యూజిలాండ్ తో.. నవంబర్ 3న అఫ్ఘనిస్తాన్ తో ఆడనుంది. నవంబర్ 5న బీ గ్రూపులో తొలి స్థానంలో ఉన్న జట్టుతో.. 8 వ తేదీన ఎ గ్రూపులో రెండో స్థానంలో నిలిచిన జట్టుతో పోటీ పడనుంది.