కళ్లచుట్టు డార్క్ సర్కిల్స్ కి… పుదీనాతో చెక్ పెట్టండి

అందమైన ముఖానికి కళ్లే అందం. అయితే.. ఈరోజుల్లో లైఫ్ స్టైల్, ఉద్యోగం, ఒత్తిడి వల్ల చాలామంది కళ్ల కింద నల్లటి వలయాలతో ఇబ్బంది పడుతున్నారు. పని ఒత్తిడి వల్ల ఎక్కువగా అలసిపోవడం, నిద్రలేమి, కాలుష్యం వంటి కారణాల వల్ల కళ్ల కింద డార్క్ సర్కిల్స్ వచ్చి.. ముఖం అందాన్ని పాడు చేస్తుంటాయి. కారణాలు ఏమైనప్పటికీ, నల్లటి వలయాలను తగ్గించడానికి కొన్ని ఇంటి నివారణలు ఉన్నాయి. చాలామంది క్రీములు, కాస్మెటిక్ ఉత్పత్తులు వాడి నల్లటి వలయాలను దాచడానికి ప్రయత్నిస్తారు. అయితే ఇలా చేయడం వల్ల సున్నితమైన చర్మంలో అలెర్జీ మొదలవుతుంది. దీని వల్ల మరిన్ని సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఎలాంటి హాని చేయకుండా నల్లటి వలయాలను పోగొట్టుకోవడానికి కొన్ని రెమెడీస్ ఉన్నాయి. అవి మీకోసం..

కంటి కింద ఏర్పడిన నల్లటి వలయాలను తొలగించేందుకు ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదంటున్నారు బ్యూటీ నిపుణులు. ఇంట్లోనే నాలుగు పుదీనా ఆకులతో కండ్లకింద వచ్చే నల్లటి వలయాలను తొలగించవచ్చంటున్నారు. పుదీనాలోని మెంథాల్, విటమిన్ సీ చర్మం యొక్క సహజ గుణాలను కాపాడుతుంది. అయితే డార్క్ సర్కిల్ ని తొలగించడానికి పుదీనాని ఎలా ఉపయోగించాలంటే..

టమాట, నిమ్మరసం, పుదీనా
టమాట, నిమ్మకాయలోని బ్లీచింగ్ లక్షణాలు చర్మాన్ని డిటాక్సిఫై చేస్తాయి. సగం టమాట, ఐదారు పుదీనా ఆకులను మెత్తగా పేస్ట్ చేయాలి. దానికి ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, చిటికెడు ఉప్పు కలిపి పేస్ట్ లా చేసి దాన్ని కంటి కింద రాసి ఆరనివ్వాలి. ఆరిన తర్వాత చల్లటినీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయండి.


పుదీనా, ఆలూ
బ్లీచింగ్ గుణాలు పుష్కలంగా దొరికే ఆలుగడ్డలు చర్మం రంగును మెరుగుపరిచేందుకు బాగా పనిచేస్తాయి. ఒక బంగాళాదుంప, తాజా పుదీనా ఆకులతో.. తొక్క తీసేసిన బంగాళాదుంపలను పేస్ట్ లా చేయాలి. ఈ పేస్ట్ ని గంటపాటు రిఫ్రిజిరేటర్‌లో ఉంచాలి. ఆ మిశ్రమంలో పత్తి ముంచి కళ్ల కింద నల్ల వలయాల మీద అప్లై చేసి 20 నిమిషాలు ఉంచాలి. ఆ తర్వాత చల్లటి నీటితో కడిగండి.


పుదీనా ఆకులు, నిమ్మరసం
ఇంట్లో చేసుకోవడానికి ఇది చాలా ఈజీ మెథడ్. తాజా పుదీనా ఆకులను మెత్తగా రుబ్బాలి. అందులో కొన్ని చుక్కల నిమ్మరసం వేసి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ని కంటికింద డార్క్ సర్కిల్స్ మీద అప్లై చేయాలి. 20 నిమిషాల తర్వాత శుభ్రమైన కాటన్ క్లాత్ తో గానీ, పత్తితో గానీ క్లీన్ చేసి.. వాటర్ తో కడిగేయాలి.

mint

పుదీనా, రోజ్ వాటర్
రెండు టీస్పూన్ల రోజ్ వాటర్ లో కొన్ని పుదీనా ఆకులు వేసి మిశ్రమంలా చేయాలి. ఆ మిశ్రమాన్ని రాత్రంతా ఫ్రిజ్ లో పెట్టాలి. అలా చేస్తే అది గడ్డ కడుతుంది. దాన్ని ఉదయాన్నే కరిగించి కళ్ల కింద అప్లై చేయాలి. పదిహేను నిమిషాల తర్వాత మంచినీటితో కడిగేస్తే సరి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే కంటి కింది నల్లటి వలయాలు తొలగిపోతాయి.

పుదీనా ఆకులు, పసుపు
పసుపు యాంటీ బయోటిక్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పురాతన కాలం నుంచి పసుపును సౌందర్య సాధనంగా వాడుతున్నారు. కళ్ల కింద నల్లటి వలయాలను తొలగించడానికి కూడా పసుపును పుదీనాతో కలిపి మిశ్రమంలా చేసి వాడుతారు. ముందుగా పుదీనా ఆకులను గ్రైండ్ చేసి పేస్ట్ చేయాలి. దీనికి ఒక టేబుల్ స్పూన్ శనగ పిండి, ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి కలపండి. దీన్ని కంటి కింద వలయాల మీద అపలై చేసి కొద్దిసేపటి తర్వాత కడిగేయాలి. ఇలా చేస్తే కొన్ని రోజుల్లో మార్పు కనిపిస్తుంది.