ఉగాది రోజున పంచాంగ శ్రవణం వల్ల కలిగే లాభాలు

ఉగాది సందర్భంగా గుళ్లలో సామూహిక పంచాంగ శ్రవణం ఎంతో సందడిగా జరిగే వేడుక. ఆదాయం-ఖర్చు, రాజపూజ్యం-అవమానం, రుతువులు, అనుకూలమైన పంటలు, పశు సంరక్షణ.. తదితర వివరాలను తెలుసుకునేందుకు అందరూ ఆసక్తి చూపుతారు.

ఉగాది రోజున పంచాంగం వినడం వల్ల మంచిగుణాలు సిద్ధిస్తాయి. శత్రు నాశనం జరుగుతుంది. చెడుకలల దోషం తొలగిపోతుంది. గంగా స్నానం అంత విశేష ఫలం లభిస్తుంది. గోదానం చేస్తే వచ్చే ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. ఆయుర్‌వృద్ధిని కలిగిస్తుంది. ఉత్తమమైనది. శుభాలను ఇచ్చేది. సంతాన సంపదను అనుగ్రహిస్తుంది. అనేక కార్యాలను సుసాధ్యం చేస్తుంది.

పంచాంగం ఐదు అంగాల సమాహారం

తిథి: రెండు చంద్రోదయాల మధ్య కాలమే తిథి. అంటే చంద్రుణ్ని అనుసరించి ఏర్పాటు చేసుకున్న దినమే తిథి. పాడ్యమి, విదియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి, అమావాస్య తిథులు.

వారం: ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని. సూర్యోదయం నుంచి మళ్లీ సూర్యోదయం మధ్య కాలం ఆధారంగా వారాలను నిర్ణయించారు.

నక్షత్రం: అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి… రేవతి మొదలైన 27 నక్షత్రాలు. వీటిని చంద్రుడి గమనం ఆధారంగా నిర్ణయిస్తారు.

యోగం: శుభ సమయాలు. విష్కంభం, ప్రీతి, ఆయుష్మాన్‌… మొత్తం 27 యోగాలు ఉంటాయి. ఒక్కో యోగానికి ఒక్కో అభిమాన దేవత ఉంటాడు. శుభ సమయాలను యోగంగా పిలిచినప్పటికీ విష్కంభం, అతిగండ, శూల, గండ, వ్యాఘాత, వజ్ర, వ్యతీపాత, పరిఘ, వైధ్రుతి యోగాలను మాత్రం శుభమైనవిగా పరిగణించరు.

కరణం: అంటే తిథిలో సగం. రెండు కరణాలు కలిస్తే ఒక తిథి అవుతుంది. కింస్తుఘ్న, భవ, బాలవ, కౌలవ, తైతుల, గరజి, వణిక్‌, భద్ర, శకుని, చతుష్పాద, నాగవ అని కరణాలు మొత్తం 11. వీటిని శివుడి వివిధ రూపాలతో ముడిపెడతారు.