చలికాలంలో చురుగ్గా ఉండేలా.. వెచ్చదనం నిండేలా..

సీజన్‌ను బట్టి ఇంటి అలంకరణలో చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకుంటే.. ఇంటికి కొత్త లుక్ రావడంతో పాటు రొటీన్ ఫీలింగ్ నుంచి బయటపడొచ్చు. ఈ కాలంలో చల్లదనాన్ని తట్టుకుని నిలబడాలంటే ఇంట్లో వెచ్చదనాన్ని పెంచుకోవాలి. అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలి. చలికాలంలో వెచ్చగా ఉండేలా ఈ టిప్స్ ఫాలో అయి ఇంటిని అలంకరించుకోండి.


చలికాలంలో తలుపులు, కిటికీలు మూసేసి ఉన్నా ఇంట్లో చల్లగా ఉంటుంది. ఇంట్లో ఏ వస్తువు ముట్టుకున్నా చల్లగా తగులుతుంది. ఆఖరికి కూర్చునే సోఫా, పడుకునే మంచం చల్లగా మారిపోతాయి. అయితే అవి వెచ్చదనం పంచేలా తగిన ఏర్పాట్లు చేసుకుంటే చలి నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇందుకోసం ఏం చేయాలంటే.. సోఫా కవర్లు, పిల్లో కవర్లు, బెడ్‌షీట్లు.. మందంగా, ఉన్నితో తయారుచేసినవి ఉపయోగించాలి.


ఇంట్లో వెచ్చగా ఉండాలంటే కాసేపు లైట్లు వేసి ఉంచడం, క్యాండిల్స్ వెలిగించడం వంటివి చేయాలి. ఉదయం పూట ఇంట్లో ఎండ పడే అవకాశం ఉంటే తలుపులు, కిటికీలు తెరిచి ఉంచాలి. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఇంట్లో వేడి ఉండేలా చేయొచ్చు.


శీతాకాలం రూమ్ ఫ్రెషనర్స్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. సువాసనను వెదజల్లే క్యాండిల్స్, అగరుబత్తీ వంటివి ఇంట్లో వెలిగించాలి. దీంతో ఇంట్లోకి రాగానే చక్కటి సువాసనలు వెదజల్లడంతో పాటు వాటి నుంచి వెచ్చదనం కూడా వస్తుంది.


చలికాలంలో ఇంట్లో వెచ్చగా ఉండాలంటే కిటికీలు, తలుపులకు ఉండే కర్టెన్లు కూడా ముఖ్యమే. శీతాకాలంలో తలుపులు, కిటికీలకు ఉపయోగించే కర్టెన్లు మందంగా ఉన్నవి ఎంచుకోవాలి. మాటిమాటికీ తలుపులు, కిటికీలు మాటిమాటికీ తెరవకూడదు. ఇలా చేయడం వల్ల బయటి చల్లదనం లోపలికి ప్రవేశించకుండా ఇల్లంతా వెచ్చగా ఉంటుంది. అలాగే హాల్, బెడ్‌రూమ్, ఇతర గదుల్లో నేలపై పరిచే కార్పెట్లు కూడా మందంగా ఉండేలా చూసుకోవాలి.


ఇంటి అలంకరణలో చెక్కతో చేసిన వస్తువుల్ని కూడా మనం ఉపయోగిస్తాం. ఇవి కూడా శీతాకాలంలో వెచ్చదనాన్ని పంచుతాయి. స్టీల్, ఐరన్ వంటివి అయితే.. చలికి చల్లగా మారుతాయి. చెక్కతో చేసిన బొమ్మల్ని అక్కడక్కడా అలంకరించడం, గోడలకు వుడెన్ ఫొటోఫ్రేముల్ని తగిలించడం.. వంటి చిన్న చిన్న మార్పులు చేస్తే ఈ చలికాలంలో ఇంటిని కాస్త వెచ్చగా మార్చుకోవచ్చు. లుక్ కూడా మారుతుంది.