తన ఇంటి సమీపంలో ఆడుకుంటున్న పిల్లలపై బీజేపీ పార్టీకి చెందిన ఓ మంత్రి కొడుకు తుపాకీతో కాల్పులు జరపడం సంచలనంగా మారింది. ఈ దాడిలో నలుగురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బీహర్ రాష్ట్రంలోని నౌతన్ నియోజకవర్గ ఎమ్మెల్యే , బీహార్ పర్యాటకశాఖ మంత్రి నారాయణప్రసాద్ కుమారుడు బబ్లూ ప్రసాద్ తమ ఇంటికి సమీపంలో ఉన్న మామిడి తోట దగ్గర ఆడుకుంటున్న పిల్లలను.. అక్కడ ఆడకూడదని, తక్షణమే వెళ్లిపోవాలని మొదట హెచ్చరించారు. ఇందుకు వారు నిరాకరించగా.. కొందరు పెద్దలు కూడా వారికి తోడయ్యారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది.
అక్కడినుంచి వెళ్లిపోయిన బబ్లూ.. అనంతరం నాలుగు వాహనాల్లో తన అనుచరులను తీసుకువచ్చి వారిపై దాడికి దిగారు. అంతేగాకుండా తుపాకీ చూపించి బెదిరించారు. ఒకానొక దశలో ఆవేశంతో ఊగిపోయిన బబ్లూ ప్రసాద్.. ఒక్కసారిగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. జనార్ధన్ అనే బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అతని సోదరుడు తెలిపారు.
కాల్పుల గురించి తెలిసిన వెంటనే గ్రామ ప్రజలు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. అంతా కలిసి మంత్రి ఇంటిపైకి దండెత్తారు. ఈలోగా బబ్లూ అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు మంత్రి వాహనాన్ని ధ్వంసం చేశారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. మంత్రి ఇంటి నుంచి ఒక పిస్టల్‌ను, ఒక రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇంతవరకు మంత్రి కుమారుడిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని బాధితులు ఆరోపిస్తున్నారు.