బీజేపీ బెదిరింపుల‌కు బిహార్ ప్ర‌జ‌లు భ‌య‌ప‌డరు: తేజ‌స్వి యాద‌వ్

Tejaswi Yadav

ఆర్జేడీ చీఫ్ లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ స‌హా ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌పై తాజా అవినీతి కేసులో సీబీఐ దాడులు చేప‌ట్ట‌డం ప‌ట్ల బిహార్ అసెంబ్లీలో విప‌క్ష నేత తేజ‌స్వి యాద‌వ్ మోడీ స‌ర్కార్‌పై విరుచుకుప‌డ్డారు. స‌త్య మార్గంలో ప‌య‌నించ‌డం క‌ష్ట‌మైనా అసాధ్యం కాద‌ని, లాలూ ఎన్న‌టికీ వెన్నుచూప‌డ‌ని, ఈ ప్ర‌భుత్వాల‌కు ఆయ‌న భ‌య‌ప‌డ‌ర‌ని తేజ‌స్వి యాద‌వ్ ట్వీట్ చేశారు.

ఆలస్యమైనా చివ‌రికి వాస్త‌వమే విజ‌యం సాధిస్తుంద‌ని, తాము ఈ పోరాటంలో విజ‌యం సాధిస్తామ‌ని, గెలుపు ల‌భించేవ‌ర‌కూ త‌మ పోరాటం కొన‌సాగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. లండ‌న్‌లో ఓ కార్య‌క్ర‌మంలో ప్ర‌సంగించేందుకు లాలూ కుమారుడు తేజ‌స్వి యాద‌వ్ విదేశాలకు వెళ్లిన స‌మ‌యంలో ఈ దాడులు జ‌రిగాయి.

మరోవైపు ఆర్జేడీ చీఫ్ లాలూ ప్ర‌సాద్ యాద‌వ్‌, ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌పై సీబీఐ తాజా అవినీతి కేసులో చ‌ర్య‌ల‌కు దిగ‌డం ఊహించిందేన‌ని ఆర్జేడీ ప్ర‌తినిధి, రాజ్య‌స‌భ ఎంపీ మ‌నోజ్ కుమార్ ఝా పేర్కొన్నారు. అధికారం చేజారుతుంద‌ని భావించిన ప్ర‌తిసారీ కేంద్ర దర్యాప్తు ఏజెన్సీల‌ను త‌న ప్ర‌త్య‌ర్ధుల‌పై బీజేపీ ఉసిగొల్పుతుంద‌ని ఆరోపించారు.

బిహార్‌లో బీజేపీకి వ్య‌తిరేకంగా రాజ‌కీయ శ‌క్తుల‌ను ఏకం చేసే ప్ర‌య‌త్నాలు ఊపందుకోవ‌డంతో లాలూ ప్ర‌సాద్‌పై సీబీఐ తాజా దాడుల‌కు దిగింద‌ని పేర్కొన్నారు. కొంద‌రిని ల‌క్యంగా చేసుకుని ప్ర‌త్య‌ర్ధుల‌ను భ‌య‌పెట్టాల‌ని కాషాయ పార్టీ ప్ర‌య‌త్నిస్తోంద‌ని, బీజేపీ బెదిరింపుల‌కు తమ‌తో పాటు బిహార్ ప్ర‌జ‌లు భ‌య‌ప‌డబోర‌ని స్ప‌ష్టం చేశారు.