బీజేపోళ్లు అబ‌ద్ధాలు ప్ర‌చారం చేసి గెల్వాల‌ని చూస్తున్నారు.. గ‌మ‌నించి తిప్పికొట్టాలి: మంత్రి హ‌రీష్ రావు

బీజేపోళ్లు అబ‌ద్ధాల‌తో గెలిచేందుకు య‌త్నిస్తున్నార‌ని, ఈట‌ల రాజేంద‌ర్ గోబెల్స్ ప్ర‌చారాన్నే న‌మ్ముకున్నారని మంత్రి హ‌రీశ్‌రావు విమ‌ర్శించారు. హుజూరాబాద్‌లో శ‌నివారం ఆయ‌న విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడారు. త‌మ స‌భ‌ల్లో మాట్లాడుతుంటే వాల‌నే క‌రెంట్ క‌ట్ చేస్తున్నార‌ని, త‌న‌ను వేధిస్తున్నారంటూ ఈట‌ల రాజేంద‌ర్ ప్ర‌జ‌ల సానుభూతి పొందేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని హ‌రీశ్‌రావు ఎద్దేవా చేశారు. అస‌లు ఆ ఫంక్ష‌న్‌హాల్‌కు క‌రెంట్ క‌నెక్ష‌న్ లేద‌ని, బిల్లు క‌ట్ట‌కుంటే క‌ట్‌చేశామ‌ని విద్యుత్‌శాఖ అధికారులు చెబుతున్నారు.

యాక్సిడెంట్ పై పెద్ద డ్రామా న‌డిపిండ్రు

ప్ర‌భుత్వ‌ విప్ సుమ‌న్ కారు ఓ ఆటోడ్రైవ‌ర్‌ను గుద్దింది అని ఆరోపిస్తూ జాతీయ రహదారిపై ఈట‌ల బ్యాచ్‌ ఎన్నిక‌ల నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ధ‌ర్నా చేసింద‌న్నారు. మొద‌ట‌ సుమన్ కారు గుద్దిందని, తర్వాత సుమన్ సోదరుడి కారు అని, త‌ర్వాత మ‌రొక‌రంటూ పుకార్లు లేపార‌ని మంత్రి హ‌రీశ్‌రావు ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు కారును ప‌ట్టుకుంటే అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డింద‌న్నారు. ఆటోడ్రైవ‌ర్‌ను గుద్దింది బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌కి స‌న్నిహితుడైన విశ్వ‌నాథ్ ఆనంద్ కారు అని తేలింద‌న్నారు. దీనిపై ఈట‌ల రాజేంద‌ర్ ఇప్ప‌టివ‌ర‌కూ ఒక్క మాట‌ల కూడా మాట్లాడ‌లేద‌ని హ‌రీశ్‌రావు మండిప‌డ్డారు.

ఏడేండ్లు మంత్రిగా చేసిన ఈట‌ల‌కు రాష్ట్ర ప‌న్ను ఎంతో తెల్వ‌దా?

రాష్ట్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్‌పై రూ. 291 రూ పన్ను వేస్తోంది.. దాన్ని తొల‌గించ‌వ‌చ్చు క‌దా అంటూ ఈట‌ల రాజేంద‌ర్ ఓ స‌భ‌లో మాట్లాడార‌ని, దీనిపై చ‌ర్చ‌కు రా అని స‌వాల్ విసిరితే ప‌త్తా లేకుండా పోయాడ‌ని మంత్రి హ‌రీశ్‌రావు మండిప‌డ్డారు. ఏడేళ్లు మంత్రిగా చేసిన ఈట‌ల రాజేంద‌ర్‌కు గ్యాస్‌ సిలిండ‌ర్‌పై రాష్ట్ర ప‌న్ను ఎంత ఉంటుందో తెలువ‌దా? అని ప్ర‌శ్నించారు. అలాగే, శంభునిప‌ల్లిలో మ‌హిళ‌ల‌కు వ‌డ్డీలేని రుణాల‌కు సంబంధించి ఫేక్ చెక్కులు ఇచ్చార‌ని, ఈ నెల 30లోగా చెక్కులు క్లియ‌ర్ చేయాలంటూ ఈట‌ల రాజేంద‌ర్ మ‌రో ఫేక్ ముచ్చట చెప్పార‌ని మంత్రి హరీశ్‌రావు మండిప‌డ్డారు. ఐదు మండ‌లాల్లో రూ.25.89 కోట్లు ఇచ్చామ‌ని, బతుకమ్మ పండుగకు ముందు అందరి ఖాతాల్లో డ‌బ్బులు జ‌మ అయ్యాయ‌న్నారు. మ‌హిళ‌లు కూడా డ‌బ్బులు వ‌చ్చాయ‌ని చెప్పార‌ని గుర్తు చేశారు.

రెండు పార్టీల పాల‌న‌ను రెఫ‌రెండంగా తీసుకుందామా?

ఈట‌ల రాజేంద‌ర్‌ ప్ర‌తిదానికీ బ‌ట్ట‌కాల్చి మీద వేసే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని, దానికి విశ్వసనీయత ఉంటుందా? అని మంత్రి హ‌రీశ్‌రావు ప్ర‌శ్నించారు. సోష‌ల్‌మీడియా, క‌ర‌ప‌త్రాల‌తో అబ‌ద్ధాల‌ను ప్ర‌చారం చేస్తున్నార‌ని, హుజూరాబాద్ ప్ర‌జ‌లు గ‌మ‌నించి తిప్పికొట్టాల‌ని సూచించారు. ఈ ఉప ఎన్నిక‌ల‌ను ఏడేళ్ల బీజేపీ పాలన‌, ఏడేళ్ల టీఆర్ఎస్ పాలనకు రెఫ‌రెండంగా తీసుకుందామా అని స‌వాల్ విసిరాడు. అబ‌ద్ధాల‌ను న‌మ్మితే ఆగ‌మ‌వుతార‌ని, ఆలోచించి అభివృద్ధికే ప‌ట్టంగ‌ట్టాల‌ని మంత్రి హ‌రీష్ రావు కోరారు.