వరి కొనుగోళ్లపై బీజేపీ నేతలది బాధ్యతారాహిత్యం: మంత్రి నిరంజన్ రెడ్డి

Minister Niranjan Reddy press meet

Minister Niranjan Reddy press meet

వరి కొనుగోళ్లపై బీజేపీ నేతలది బాధ్యతారాహిత్యమని వ్యవసాయ శాఖ మంత్రి ఎస్. నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఎం. శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ది రైస్ మిల్లర్ల ప్రభుత్వం అని బీజేపీ నేతలు చిల్లర మల్లర మాటలు మాట్లాడుతున్నారు.. రైస్ మిల్లర్ల ప్రభుత్వమో రైతుల అనుకూల ప్రభుత్వమో ఎవరినడిగినా చెబుతారని మంత్రి అన్నారు.

దక్షిణాది రాష్ట్రాల పై కేంద్రం వివక్ష

‘‘నేను సవాల్ విసిరితే బీజేపీ నేతలు దీక్షలు చేసి పలాయనం చిత్తగించారు. ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వంది దళారీ పాత్ర అని ఒక బీజేపీ నేత అంటారు. రాష్ట్ర  ప్రభుత్వానిది దళారీ పాత్ర అంటారా.. మరి మోడీ కూడా సీఎంగా కూడా చేశారు.. ఆయన కూడా దళారీ పాత్ర పోషించారా? మద్దతు ధరతో పాటు పంట ఉత్పత్తుల కొనుగోలు కేంద్రానికున్న రాజ్యాంగ బాధ్యత. రాజ్యాంగం ఆర్టికల్ 246 ప్రకారం కేంద్రానికి ఉన్న బాధ్యత ను విస్మరిస్తోంది. పంజాబ్ లో ధాన్యమంతా కొంటూ తెలంగాణకు మొండి చేయి చూపుతారా. దక్షిణాది రాష్ట్రాల పై కేంద్రం ప్రదర్శిస్తుంది వివక్ష కాదా?

బీజేపీవి గల్లీ స్థాయి సిల్లీ రాజకీయాలు

హుజురాబాద్ లో బీజేపీ ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తోంది. జాతీయ పార్టీ అని చెప్పుకునే బీజేపీ గల్లీ స్థాయికి చేరి సిల్లీ రాజకీయాలు చేస్తోంది. స్టార్ క్యాంపెనర్లు ఎన్నికల రోజుకు 48 గంటల ముందు ప్రెస్ మీట్లు పెట్టొద్దని ఎన్నికల సంఘం నిబంధన చెబుతోంది. ఇది తెలిసి కూడా ఈటెల ప్రెస్ మీట్ పెట్టేందుకు ఎందుకు ప్రయత్నించారు. ఈటెల ప్రెస్ మీట్ ను నిబంధనల ప్రకారం అడ్డుకుంటే రాష్ట్రప్రభుత్వ తప్పు ఎలా అవుతుంది. మా ఎంపీ కెప్టెన్ లక్ష్మీ కాంత రావు ఇంట్లో సోదాలు జరిపితే సహకరించలేదా. అనవసర వివాదాలు బీజేపీ ఆపితే మంచిది.

రాష్ట్రం ఉన్నంత వరకు రైతు బంధు ఆగదు

బీజేపీ వ్యవసాయ కమిషనరేట్ దగ్గర ధర్నా చేయడం డ్రామా కాదా. వ్యవసాయ కమిషనర్ ధాన్యం కొనుగోలు చేస్తారా? వరి వేస్తే రైతు బంధు ఆపుతారని బీజేపీ దుర్మార్గపు ప్రచారం చేస్తోంది. రైతు బంధు ఎలాంటి షరతులు లేకుండా అమలు చేస్తాం. రాష్ట్రం ఉన్నంత వరకు రైతు బంధు కొనసాగుతుంది. వరి వేస్తే ఉరి అని ఎక్కడా చెప్పలేదు. కొందరు వ్యవసాయ నిపుణులు అలాంటి హెచ్చరిక చేశారు. కేసీఆర్ ను మించిన రైతు ఎవ్వరు లేరు.. రైతుల కష్టాలు కేసీఆర్ కు తెలుసు.

చేతకాక పోతే చెప్పండి.. ఏం చేయాలో చేస్తాం

కేంద్రానికి చేతకాక పోతే ధాన్యం కొనుగోలు చేయమని చెప్పాలి.. చెబితే ఏం చేయాలో మేము చేస్తాం. కేసీఆర్ పై షర్మిల చేస్తున్న పరుష పద జాల ప్రయోగాన్ని ఖండిస్తున్నాం. షర్మిలపై నేను చేసిన వ్యాఖ్యల్లో మనోభావాలు గాయపడితే విచారం వ్యక్తం చేస్తున్న. ఏపీ మంత్రి పేర్ని నాని రెండు రాష్ట్రాలు కలవాలని అంటున్నారు. ముందు షర్మిల దీనిపై వైఖరి ఏమిటో తెలియ జేయాలి.. తన అన్నను అడగాలి. వ్యవసాయం ఉమ్మడి జాబితా అంశం.. కేంద్రం తన బాధ్యత విస్మరించజాలదు.

రైతులను మోసం చేసిన చరిత్ర బీజేపోళ్లది

ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. ‘‘ఎంపీ ధర్మపురి అరవింద్ మా సీఎం,  కేబినెట్ మంత్రులపై వాడిన భాషను ఖండిస్తున్నాం.. పసుపు బోర్డు తెస్తానని పారిపోయిన అరవింద్ కు వ్యవసాయం మీద మాట్లాడే అర్హత ఉందా.. రైతులను హత్యలు చేస్తున్న ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. పసుపు బోర్డు తెస్తా అని రైతులను మోసం చేసిన చరిత్ర అరవింద్ ది. బీజేపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోని మాట్లాడాలి. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించం ఖబడ్దార్’’ అంటూ  బీజేపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు.