పవర్ కట్‎తో కనిపించక.. ఒకరికి కట్టాల్సిన తాళి మరొకరికి

  • పవర్ కట్‎తో మారిన పెళ్లికూతుళ్లు
  • ఒకరితో జరగాల్సిన పెళ్లి మరొకరితో
  • కరెంట్ వచ్చిన తర్వాత మరొసారి పెళ్లి
  • మధ్యప్రదేశ్ లో ఘటన

ఒకే వేదికపై మూడు పెళ్లిళ్లు. చుట్టూ బంధువులు, స్నేహితులు. ఒకేసారి మూడు పెళ్లిళ్లు కావడంతో అందరూ ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా ఎదురుచూస్తున్న ముహుర్తపు సమయం రానే వచ్చింది. అందరూ తాళి కట్టేశారు. కాసేపటి తర్వాత చూసే సరికి పెళ్లికూతుళ్లు మారిపోయారు.

మధ్యప్రదేశ్‌లోని అస్లానా గ్రామానికి చెందిన రమేష్ భీవేరేకు నికిత, కరిష్మ, కోమల్ అనే ముగ్గురు కుమార్తెలున్నారు. వీరందరికీ ఒకేసారి పెళ్లి చేయాలనుకున్నాడు. ఈ క్రమంలో ముగ్గురికి ముగ్గురు అబ్బాయిలను వెతికి పెళ్లికి ఏర్పాట్లు చేశాడు. ఒకే వేదికపై ఒకేసారి మూడు పెళ్లిళ్లు రాత్రి ముహుర్తానికి నిశ్చయించారు. అయితే తీరా తాళి కట్టే సమయంలో కరెంట్ పోయింది. పైగా ముహుర్తపు సమయం దగ్గరపడటంతో పురోహితుడు తొందరపెట్టాడు. ఆ హడావిడిలో పెళ్లి కొడుకులు ఒకరికి కట్టాల్సిన తాళి మరొకరికి కట్టారు. కరెంట్ వచ్చిన తర్వాత చూసుకునేసరికి పెళ్లి కూతుళ్లు మారినట్లు గుర్తించారు. దాంతో కాసేపు వేదికపై ఘర్షణ వాతావరణం నెలకొంది. పెళ్లి పెద్దలు కల్పించుకొని.. ఇరుకుటుంబాలతో మాట్లాడి.. ఏ పెళ్లికొడుకుకు ఏ పెళ్లికూతురో చూసి మరొసారి పెళ్లి జరిపించారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.