పార్టీ టికెట్‌ రానందుకు బోరున ఏడ్చిన బీఎస్పీ నాయకుడు.. పీఎస్ లో కంప్లైంట్

BSP leader who cried for not getting party ticket

ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో పార్టీలు టిక్కెట్ల వ్యవహారంలో అనేక పరిణామాలు జరుగుతున్నాయి. పార్టీ టికెట్‌ రానందుకు ఒక పార్టీ నేత బోరున ఏడ్చారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆయన, ఆత్మహత్య చేసుకుంటానని కూడా బెదిరించారు.

బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) నాయకుడు అర్షద్ రాణా, ముజఫర్‌నగర్‌లోని చార్తావాల్ స్థానం నుండి టికెట్ ఆశించారు. చార్తావాల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని దధేడు గ్రామానికి చెందిన ఆయన చాలా కాలంగా బీఎస్పీలో యాక్టివ్ నేతగా ఉన్నారు. దీంతో ఆయన పార్టీ టికెట్‌పై ఆశలు పెట్టుకున్నారు.

అయితే చార్తావాల్ అసెంబ్లీ స్థానం నుండి సల్మాన్ సయీద్‌ను పార్టీ పోటీకి దింపినట్లు బీఎస్పీ అధినేత్రి మాయావతి ఇటీవల ట్వీట్ చేశారు. కాంగ్రెస్‌ నేత అయిన సల్మాన్ సయీద్, హోం శాఖ మాజీ రాష్ట్ర మంత్రి సయీదుజ్జమాన్ కుమారుడు.

పార్టీ అధినేత్రి ట్వీట్ తర్వాత ఆయన తన మద్దతుదారులతో కలిసి కొత్వాలి నగరానికి చేరుకున్నారు. రెండేళ్ల క్రితం పార్టీ సీనియర్ నాయకుడు టికెట్ కోసం రూ. 67 లక్షలు డిమాండ్ చేశారని ఆరోపించారు. ఈమేరకు ఒక బీఎస్పీ నేతపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని రాణా బెదిరించారు.

రాణా ఫిర్యాదుపై విచారణ జరుపుతున్నామని, అనంతరం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కొత్వాలి నగర ఇన్‌ఛార్జ్ ఇన్‌స్పెక్టర్ ఆనంద్ దేవ్ మిశ్రా తెలిపారు. ఇదిలా ఉండగా.. పోలీస్‌ స్టేషన్‌లో పోలీసుల ముందు అర్షద్‌ రాణా బోరున ఏడుస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.