10 సెకండ్లు ఇలా చేయలేకపోతే మీ టైం దగ్గరపడ్డట్లే..

ఆరోగ్యం కోసం చాలామంది వ్యాయామం, యోగా వంటివి చేస్తుంటారు. ప్రస్తుత కాలంలో జాబ్ స్ట్రెస్, ఆహారపు అలవాట్లు, నిద్ర పోయే సమయం వంటి వాటి వల్ల ప్రతి ఒక్కరూ అనారోగ్యం బారినపడుతున్నారు. అందుకే ప్రతి ఆర్నెళ్లకో, మూణ్ణేళ్లకో హెల్త్ చెకప్ చేయించుకుంటుంటారు. మనం కొన్ని నియమాలు పాటించి ఇంట్లోనే ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవచ్చు. అందులో ఒకటి ఒంటికాలిపై నిలబడటం. ఒంటికాలిపై కనీసం 10 సెకండ్ల పాటు నిలబడటానికి ప్రయత్నించండి. అలా నిలబడలేని మధ్య వయస్కులకు మరణ ముప్పు పొంచి ఉన్నట్టేనని తాజాగా ఓ అధ్యయనం పేర్కొన్నది. అటువంటి వారు మరో దశాబ్దంలోగా మరణించే ప్రమాదం ఎక్కువగా కనిపిస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన అధ్యయన వివరాలు బ్రిటీష్‌ జర్నల్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌ మెడిసిన్‌లో ప్రచురితమయ్యాయి. సపోర్టు లేకుండా నిలబడగలిగిన వారి కంటే నిలబడలేని వారు వచ్చే 10 ఏండ్లలో మరణించే అవకాశం 84 శాతం ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. 2009 నుంచి బ్రెజిల్‌లో 1,702 మంది 50 ఏండ్లకు పైబడిన వ్యక్తులపై ఈ అధ్యయనం చేశారు. ఆయా వ్యక్తుల వయసు, ఫిట్‌నెస్‌, ఆరోగ్యం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. వీరందరి మీద 13 ఏండ్లుగా పరిశోధన చేయగా.. అందులో ఒంటికాలుపై బ్యాలన్స్ చేయలేని చాలామంది చనిపోయినట్లు గుర్తించారు.