అభివృద్ధి ప్రాజెక్టుల కేటాయింపుల్లో కేంద్రం పక్షపాత ధోరణి ప్రదర్శిస్తోంది: కేటీఆర్

KTR speech in Manufacturing Excellence Awards

దేశ జీడీపీ, ఎకానమీకి తెలంగాణ కీలక భాగస్వామిగా ఉంది.. అయినప్పటికీ రాష్ట్రానికి తిరిగి ఇచ్చేందుకు కేంద్రానికి మనసు రావడం లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. ఐటీఐఆర్ ప్రాజెక్టు, బుల్లెట్ ట్రైన్, ఇతర ఏ అభివృద్ధి ప్రాజెక్టుల్లోనూ రాష్ట్రాన్ని కేంద్రం భాగస్వామిని చేయలేదని కేటీఆర్ తెలిపారు.

హైదరాబాద్ ఐటీసీ కాకతీయలో సీఐఐ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి కేటీఆర్ ముఖ్యఅథిగా హాజరయ్యారు. బెస్ట్ ఇన్నోవేషన్, బెస్ట్ స్టార్టప్, బెస్ట్ ఎక్స్ పోర్ట్ కేటగిల్లో అవార్డులను కేటీఆర్ అందజేశారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. అభివృద్ధిలో దూసుకెళ్తోన్న తెలంగాణ లాంటి రాష్ట్రాలకు మరింత చేయూతను అందించాల్సిన కేంద్ర ప్రభుత్వం పక్షపాత ధోరణి ప్రదర్శిస్తోందన్నారు. ఎంఎస్ఎంఈలను ఆదుకునేందుకు కేంద్రం ప్రకటించిన ఆత్మనిర్భర్‌ ప్యాకేజీ నిధులను వారికి అందించే వరకు కేంద్రానికి గుర్తు చేస్తూనే ఉంటామని కేటీఆర్ స్పష్టం చేశారు.