‘ఒమిక్రాన్’పై రాష్ట్రాలకు కేంద్రం గైడ్ లైన్స్

carona-virus

ఒమిక్రాన్ రకం కరోనా వైరస్‌పై రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి లేఖ రాశారు. ఒమిక్రాన్ రకం వైరస్‌ను గుర్తించిన దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల విషయంలో కఠినంగా స్క్రీనింగ్ చేపట్టాలని సూచించారు. ఇంటెన్సివ్ కంటైన్మెంట్, పటిష్ట నిఘా, వ్యాక్సినేషన్ విస్తృతం చేయాలన్నారు.

కోవిడ్-19 పరీక్షలను పెంచాలని ఆదేశించిన కేంద్రం.. కొన్ని రాష్ట్రాల్లో ఆర్టీ-పీసీఆర్ పరీక్షల సంఖ్య తగ్గినట్టు గుర్తించినట్టు పేర్కొంది. హాట్‌ స్పాట్లను గుర్తించి, నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని లేఖలో సూచించింది. పాజిటివిటీ రేటు 5 శాతం కంటే ఎక్కువున్న ప్రాంతాలపై రాష్ట్రాలు ప్రత్యేక దృష్టి సారించాలని నిర్దేశించింది.

కేంద్రం అందజేసిన నిధులను సమర్థవంతంగా వైద్య సదుపాయాల కల్పన కోసం వినియోగించాలి. కొత్త రకం మ్యుటేషన్లను గుర్తించే జీనోమ్-సీక్వెన్సింగ్ పరీక్షలను పెంచాలని రాష్ట్రాలకు సూచించింది. ఇందుకోసం దేశవ్యాప్తంగా ఉన్న ఇండియన్ సార్స్-కోవ్-2 జీనోమిక్స్ కన్సార్షియం ల్యాబులను వినియోగించుకోవాలని లేఖలో సూచించింది.

తప్పుడు సమాచారంతో భయాందోళనలు, అపోహలు చెలరేగకుండా ఎప్పటికప్పుడు సరైన సమాచారం అందించేలా ప్రెస్ బ్రీఫింగ్, బులెటిన్లు విడుదల చేయాలని రాష్ట్రాలకు సూచించింది. ఓమిక్రాన్ రకం వైరస్ ప్రస్తుతం బ్రిటన్, జర్మనీ, ఇటలీ, బెల్జియం, ఆస్ట్రియా, బోట్స్ వానా, ఇజ్రాయిల్, హాంగ్‌కాంగ్ దేశాల్లో గుర్తించినట్లు కేంద్రం స్పష్టం చేసింది.