కేంద్ర వ్యవసాయ చట్టాలు రైతులకు మేలు చేసేవి కావు

Minister Niranjan Reddy said the government was ready to replace 100 per cent of the jobs

కేంద్ర వ్యవసాయ చట్టాలు రైతులకు మేలు చేసేవి కావని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. షాద్ నగర్ మార్కెట్ కమిటీ నూతన పాలకమండలి ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్ర వ్యవసాయ నూతన చట్టాలలో పంటలకు కనీస మద్దతుధరల ప్రస్తావన లేదన్నారు. నిత్యావసర వస్తువుల చట్టాన్ని నిర్వీర్యం చేసే అంశాలున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మనం పండించిన పంటలే రూ.60 కి అమ్మి రూ.120 కి కొనాల్సిన ప్రమాదకర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందన్నారు.

రైతు పండించిన పంటలన్నీ సమాజ అవసరాల కోసమేనని, వారికి రైతుబంధు కింద సాయం అందించేది వారిని ప్రోత్సహించడం కోసమేనన్నారు. రైతుబంధు కింద ఈ వానాకాలం 60.84 లక్షల మందికి రూ.7360.40 కోట్లు రైతుల ఖాతాల్లో జమచేశామన్నారు. కేసీఆర్ సహకారంతో వనపర్తికి సాగునీరు తీసుకురావడం జరిగిందన్నారు. ఖిల్లా ఘణపురం గణప సముద్రం వందేళ్లలో మూడు సార్లు నిండితే.. మూడోసారి కృష్ణమ్మ నీళ్లతో అలుగుపారించడం జరిగిందన్నారు. రెండేళ్లు పంటలు పండడంతో ఆ ప్రాంత ముఖచిత్రమే మారిపోయిందన్నారు.

ఇవాళ తెలంగాణలోని వందలాది మండలాలలో సాగునీటి రాకతో వర్తక, వాణిజ్యం పెరిగిందన్నారు. వ్యవసాయరంగం ప్రాధాన్యతనివ్వడం ఉత్పత్తుల రాకతో వ్యవసాయం, దాని అనుబంధ రంగాల పరిస్థితి మారిపోయిందన్నారు. వ్యవసాయరంగాన్ని బలోపేతం చేస్తే సమూల మార్పు వస్తుందని దూరదృష్టితో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాల మూలంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ స్వరూపమే మారిపోయిందని మంత్రి అన్నారు.

తెలంగాణ న్యాయమైన నీళ్లు, నిధులు, నియామకాల కోసమే రాష్ట్రాన్ని సాధించుకున్నామని మంత్రి మరోసారి గుర్తు చేశారు. ఛార్జింగ్ పెట్టి లేపినా కాంగ్రెస్ పార్టీ లేసే పరిస్థితి లేదన్నారు. ఆంధ్రా నాయకుల కింద బానిసలుగా ఉన్న నాడు మరుగున పడ్డ తెలంగాణ ఉద్యమాన్ని లేవనెత్తి కేసీఆర్.. దేశంలో 36 పార్టీలను ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని గుర్తు చేశారు.

ఆంధ్రా నాయకత్వం కింద బానిసలుగా ఉన్నోళ్లకు కేసీఅర్ ని విమర్శించే అర్హత లేదన్నారు. ఆంధ్రా నేతలు ఇక్కడ పార్టీ పెట్టి కేసీఆర్ నువిమర్శించడం అవివేకం.. ప్రజలను ఒప్పించే రాజకీయాలు చేస్తే సంతోషం కానీ తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ని తూలనాడితే సహించమని హెచ్చరించారు.

ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న భారత ప్రధాని నరేంద్రమోడీ వాగ్ధానం ఏమయిందని మంత్రి ప్రశ్నించారు. వాగ్ధానం నెరవేర్చనందుకు బీజేపీ నేతలు సిగ్గుపడాలన్నారు. దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వనన్ని ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రం ఏడేళ్లలో ఇచ్చిందన్నారు. కేంద్ర ఉద్యోగాలు ఏడు లక్షలు ఖాళీలు ఉన్నాయి.. కేంద్రం వీటిని భర్తీ చేయాలని కాంగ్రెస్ ఎందుకు డిమాండ్ చేయడం లేదన్నారు.

కాంగ్రెస్, బీజేపీలను ప్రశ్నించలేనోళ్లు కేసీఆర్ ని విమర్శిస్తున్నారని మంత్రి మండిపడ్డారు.  30 ఏండ్లు ప్రభుత్వంలో ఉన్నోళ్లు ఆనాటి పాలకుల దమననీతిని, అణచివేతను ప్రశ్నించలేనోళ్లు ఇయాల కేసీఆర్ ను విమర్శించడం వెనక మర్మమేమిటని ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఎక్కడైనా తెలంగాణ మాదిరి పథకాలు అమలవుతున్నాయా? కనీసం ఎక్కడైనా 5 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చారా? కేవలం మూడేళ్లలో కేసీఆర్ 50 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే కాళేశ్వరం నిర్మించారన్నారు.

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలతో సాగునీరు ఇద్దామంటే కాంగ్రెస్ నేతలు 88 కేసులు వేశారు. ఎవరికీ సాధ్యం కాని తెలంగాణ సాధించారని కేసీఆర్ పై విమర్శలు చేస్తున్నారు. సంస్కారం, బాధ్యతతో విమర్శలు చేయాలి.. సహనానికి కూడా ఓ హద్దు ఉంటుంది. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ తో షాద్ నగర్ సస్యశ్యామలం అవుతుంది. ఎవరెన్ని ఆటంకాలు సృష్టించినా పాలమూరు రంగారెడ్డి పూర్తి చేస్తామని మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, ఎమ్మెల్సీ, విప్ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, ఎమ్మెల్సీలు సురభి వాణిదేవి, కసిరెడ్డి నారాయణరెడ్డి, జడ్పీ చైర్మన్ తీగల అనితా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి తదితరులున్నారు.