సైబర్ నేరాలకు ‘సైబర్ యోదా’తో చెక్: సీపీ మహేష్ భగవత్

టెక్నాలజీని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు నేరాలకు పాల్పడుతున్నారని,  ముఖ్యంగా మహిళలు, చిన్నారులు, సామాన్యులు వీరి బారిన పడుతున్నారని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ అన్నారు. సైబర్ మోసాల పరిష్కారానికి సైబర్ యోదా పనిచేస్తుందని సీపీ అన్నారు.

లాక్ డౌన్ కంటే ముందు సైబర్ యోదా ను ప్రారంభించామని, ప్రస్తుతం 100 మందితో సైబర్ యోదా సమర్థవంతంగా పనిచేస్తుందన్నారు. సైబర్ యోదా కార్యక్రమంలో 21 మంది విద్యార్థులు, 30 ఐటీ ఉద్యోగులు, 6 రిటైర్డ్ ఉద్యోగులు స్వచ్ఛందంగా పని చేస్తున్నారని సీపీ చెప్పారు.

సైబర్ నేరగాళ్ల చేతిలో మోస పోయిన  వారు వివిధ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని, ఇలాంటి ఫిర్యాదులను సైబర్ యోదా పరిష్కరిస్తుందన్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో సంధాన కర్తగా సైబర్ యోదా పనిచేస్తుందన్న సీపీ.. ఆన్ లైన్ మోసాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

టెక్నాలజీని మంచి కన్న చెడు కోసం ఉపయోగించే వాళ్ళు ఎక్కువగా ఉన్నారన్నారు. సైబర్ ల్యాబ్ కూడా త్వరలోనే అందుబాటులోకి వస్తుందని రాచకొండ సీపీ మహేష్ భగవత్ చెప్పారు.