బ్రిటన్‌ పార్లమెంట్‌నే లక్ష్యంగా చేసుకున్న చైనా

China spy targeting the British Parliament

చైనా బరితెగించింది. ఏకంగా బ్రిటన్‌ పార్లమెంట్‌నే లక్ష్యంగా చేసుకుంది. చైనాకు అనుకూలంగా ఎంపీలను కొనేందుకు రహస్య ప్రణాళికలను తయారు చేసి అమలు చేస్తుందట. ఈ విషయాన్ని బ్రిటన్‌ నిఘా సంస్థ ఎంఐ5 గుర్తించింది. దీంతో తొలిసారి బ్రిటన్‌ రాజకీయాల్లో చైనా జోక్యంపై హెచ్చరికలు జారీ చేసింది. ఈ మొత్తం వ్యవహారం వెనుక ఆంగ్లో-చైనా జాతీయురాలు క్రిస్టీన్‌ చింగ్‌ కుయ్‌ లీ ఉన్నట్లు ఆరోపించింది.

ఈ ఘటన పశ్చిమ దేశాల్లో సంచలనం సృష్టించిస్తుంది. ఈ కుట్రను చైనాకు చెందిన ‘ది యునైటెడ్‌ ఫ్రంట్‌ డిపార్ట్ మెంట్‌’ వెనుక ఉండి నడిపిస్తోందని ఎంఐ5 ఆరోపించింది. చైనా, హాంకాంగ్‌ల నుంచి క్రిస్టీన్‌కు సొమ్ము చేరుతుండగా.. వాటిని బ్రిటన్‌ రాజకీయ నాయకులకు విరాళాలుగా ఇస్తోంది. ఆమె వెనుక ఉన్న వారి ఆచుకీ తెలుసుకోవడానికి ఎంఐ5 చాలా రోజులపాటు సీక్రెట్ ఆపరేషన్ చేపట్టింది.

విరాళాల రూపంలో నిధులు

క్రిస్టీన్‌ లీ నుంచి నిధులు అందుకొన్న వారిలో లేబర్‌ పార్టీ ఎంపీ బారీ గార్డెనర్‌ ఐదేళ్లుగా 4,20,000 పౌండ్లు అందుకొన్నట్లు గుర్తించారు. లిబరల్‌ డెమొక్రటిక్‌ నాయకుడు సర్‌ ఎడ్‌ డావీ.. లీ నుంచి 5,000 పౌండ్లు అందుకొన్నాడు. అలాగే మాజీ ప్రధాని డేవిడ్‌ కామరూన్‌, లేబర్‌ పార్టీ డిప్యూటీ లీడర్‌ టామ్‌ వాట్సన్‌, లండన్‌ మాజీ మేయర్‌ కెన్‌ లివింగ్‌స్టోన్‌ వంటి వారితో క్రిస్టీన్‌కు మంచి సంబంధాలు ఉన్నాయని ఎంఐ5 పేర్కొంది.

ఆరోపణల నేపథ్యంలో అవార్డు వెనక్కి

హోం సెక్రటరీ ప్రీతీ పటేల్‌ ఈ ఘటనపై స్పందించారు. ‘చైనా కమ్యూనిస్టు పార్టీ కోసం ఉద్దేశపూర్వకంగానే పార్లమెంట్‌ సభ్యులను ప్రభావితం చేయాలనుకోవడం చాలా ఆందోళనకరం.’ అని పేర్కొన్నారు. లీ చైనా అధ్యక్షుడు షీజిన్‌ పింగ్‌తో కలిసి దిగిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చైనా-బ్రిటన్‌ సమాజాల మధ్య సంబంధాలను పెంచేందుకు చేసిన కృషికి గుర్తింపుగా గతంలో థెరిస్సా మే నుంచి క్రిస్టీన్‌ లీ వార్డు కూడా అందుకొన్నారు. దీన్ని తాజాగా ఉపసంహరించుకొన్నారు.

అంతా అది చెప్పినట్టే..

చైనాలో యునైటెడ్‌ ఫ్రంట్‌ డిపార్ట్ మెంట్‌ చాలా శక్తిమంతమైంది. ఇది కమ్యూనిస్టు పార్టీ సెంట్రల్‌ కమిటీ కనుసన్నల్లో పనిచేస్తుంది. నిఘా సమాచారం సేకరించడం, విదేశీ సంబంధాలు, విదేశాల్లోని శక్తిమంతమైన వ్యక్తులను ప్రభావితం చేయడం వంటి కార్యకలాపాలను నిర్వహిస్తుంది.