నీతి ఆయోగ్ దండగ.. దాన్ని పట్టించుకునే నాథుడే లేడు

  • నీతి ఆయోగ్ తో ఉపయోగంలేదు
  • అందుకే రేపటి సమావేశాన్ని బహిష్కరిస్తున్న

రేపు ఢిల్లీలో జరగబోయే నీతి అయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. చాలా బాధగానే ఈ నిర్ణయం తీసుకున్నానని, కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ఆయన చెప్పారు. మోడీకి లేఖ ద్వారా సమాచారాన్ని అన్ని అంశాలతో తెలియజేస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు.

‘నాకు ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటే ఎంతో గౌరవం ఉండేది. దేశ అభివృద్ధి, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రణాళికలపై విశ్లేషణ జరిగేది. ప్రజాధనం ప్రతి రూపాయి సద్వినియోగం కావాలని గతంలో పీపీఏపీ కమిటీ ఏర్పాటు చేశారు. హరిత విప్లవం అనే ఉద్యమం నెహ్రూ కాలంలో వచ్చింది. అప్పట్లో మంచి సలహాలు, సూచనలు చేస్తే ప్రధానులు స్వీకరించి అమలు చేసే వాళ్ళు. కానీ ఇప్పటి ప్రధానులు అలా లేరు. ఎస్ కె డే ఇచ్చిన సలహాలు, సూచనలు నెహ్రూ స్వీకరించి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. నెహ్రూ చేసిన అభివృద్ధి చూసి ఎస్ కె డే ఇండియా వచ్చారు. ప్రణాళికబద్ధమైన అభివృద్ధి, ప్రణాళికలు నెహ్రూ కాలంలో జరిగాయి. 2014లో మోడీ రాగానే నీతి ఆయోగ్ అని తెచ్చారు. నీతి ఆయోగ్ తెచ్చిన్నపుడు దేశానికి మంచి రోజులు వచ్చాయి అనుకున్నా. నీతి ఆయోగ్‎ను టీం ఇండియా అని సంబోధించారు. దేశంలోని ముఖ్యమంత్రులందరూ కలిసి దేశ అభివృద్ధిలో పాలుపంచుకోవడం దీని ఉద్దేశం.

నీతి ఆయోగ్ ఏర్పాటు లక్ష్యం నెరవేరలేదు. గత 8 ఏండ్లుగా నీతి అయోగ్ మూలనపడింది. నీతి ఆయోగ్ మోడీకి భజన మండలిగా మారిపోయింది. నీతి ఆయోగ్ నిష్క్రియ మండలిగా మారింది. నేతి బీరకాయలో నెయ్యి ఉన్నట్లు.. నీతి ఆయోగ్ పరిస్థితి ఏర్పడింది. కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడినట్లు మారింది. దేశంలో ఎప్పుడూ లేని దురావస్త తయారు అయింది. దేశంలో అసహనం, విద్వేషం, నిరసనలు పెరిగాయి. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 13 నెలల పాటు రైతులు ఢిల్లీలో ధర్నాకు దిగారు. దాదాపు 700 మంది చనిపోయారు. అప్పడు మన ప్రధాని దిగొచ్చి, నల్ల చట్టాలను వెనక్కి తీసుకున్నారు. రైతుల పెట్టుబడి డబుల్ అయింది కానీ, రాబడి డబుల్ కాలేదు. దేశంలో ఇప్పటికీ మంచినీటి కొరత ఉంది. దేశరాజధానిలో కూడా ట్యాంకర్ల మీద ఆధారపడే పరిస్థితి ఉంది. తాగడానికి నీళ్లు ఉండవు, సాగు చేయడానికి నీళ్లు ఉండవు. రైతులకు కరెంట్ ఉండదు, పని చేద్దామంటే ఉద్యోగాలుండవు, పెట్టుబడులు దేశం దాటి పోతున్నయ్.. ఇదీ ఇప్పుడున్న పరిస్థితి. ఉపాధిహామీ కూలీలు కూడా జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసే పరిస్థితి, దౌర్భాగ్యం వచ్చింది. దేశంలో బీడి కార్మికులు అంతరించిపోతున్న వేళ.. బీడి పరిశ్రమపై 28 శాతం జీఎస్టీ సబబేనా. నిత్యావసరాల ధరలు ఆకాశన్నంటాయి. రూపాయి పాతాళానికి పడిపోయింది. ఇలాంటి పరిస్థితులున్నప్పుడు.. నీతి ఆయోగ్ తో ఉపయోగం ఏముంది. ఒకవేళ నీతి ఆయోగ్ ఏవైనా సూచనలు చేస్తే.. కేంద్ర ప్రభుత్వం అసలు పట్టించుకోదు.

తెలంగాణకు 24 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ సూచించింది. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు 24 పైసలు కూడా ఇవ్వలేదు. మరి నీతి ఆయోగ్ ఎందుకు? మేం చెప్పిందే చేయాలంటూ బీజేపీ డిక్టేటర్ షిప్ చేస్తోంది. బుల్డోజర్లతో ఇళ్లు కూలుస్తామని బెదిరిస్తున్నారు. హనుమాన్ జయంతికి కత్తులు పట్టుకొని తిరుగుతున్నారు. ఇదేనా దేశానికి కేంద్రం ఇచ్చే సందేశం. ప్రపంచవ్యాప్తంగా దేశం పరువుపోతోంది.

రాష్ట్రాలకు ఇచ్చే డబ్బులు కూడా ఇవ్వడం లేదు. రాష్ట్రాలకు ఇచ్చే ట్యాక్స్ లను సెస్ పేరుతో దోచుకుంటున్నారు. కేంద్ర నిర్ణయాలు రాష్ట్రాల ప్రగతికి అడ్డంకిగా మారుతున్నాయి. శుష్క ప్రియాలు.. శూన్య హస్తాల మాదిరిగా కేంద్రం పనితీరు ఉంది. తెలంగాణలో అన్ని పథకాలు బాగున్నాయి అంటారు, కానీ ఒక్క పైసా మాత్రం ఇవ్వరు. గత ఆరు నెలల్లో లక్షా 90 వేల కోట్లు సమకూర్చి రాష్ట్రం కోసం ఖర్చు చేశాం. వీటిలో కేంద్రం నుంచి వచ్చింది 5 వేల కోట్లు కూడా ఉండదు. కానీ, బీజేపీ వాళ్లు మాత్రం అంతా మేమే ఇచ్చాం అని చెప్పుకుంటారు. స్పెషల్ గ్రాంట్ కింద తెలంగాణకు 6 వేల కోట్లు ఇవ్వమని ఫైనాన్స్ గ్రాంట్స్ కమిషన్ చెబితే కనీసం ఆరు పైసలు కూడా ఇవ్వలేదు. అలాంటప్పుడు నీతి ఆయోగ్ సమావేశానికి ఎందుకు వెళ్లాలి.

దేశానికి ఆర్మీ ఎంతో ముఖ్యమైనది. అటువంటి ఆర్మీ సర్వీసు రూల్స్ మార్చినప్పుడు కనీసం చర్చించాల్సిన అవసరం లేదా. ఇటువంటి పాలన దేశానికి మంచిది కాదు. రాష్ట్రాలలో ఏక్ నాథ్ షిండేలను సృష్టిస్తారంట. ఏం మజాక్ గా ఉందా. అంత అహంకారమా, అంత బలుపా. రాష్ట్రాల చేతగాని తనం అనుకుంటున్నారా. దేశంలో ఒకే పార్టీ ఉంటది అని బీజేపీ అధికార ప్రతినిధి చెప్తడు! వారి టైం నాలుగు రోజులు మాత్రమే నడుస్తది. హిరణ్యకశిపుడు లాంటి వాళ్లే అనుభవించారు. ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కాలరాస్తున్నారు. ఇప్పుడు మీరు వాడుతున్నట్లే మళ్ళీ రేపు అవే సంస్థలు మిమ్ములను కబలిస్తాయి.

దేని మీద పన్నులు వేయాలి, పన్నులు వేయొద్దు అని చర్చించరా. పాల మీద పన్ను, చస్తే పన్ను, డ్యాన్స్ చేస్తే పన్ను విధిస్తారా. మహత్మ గాంధీ మీత అనుచిత వ్యాఖ్యలు చేస్తారా. ఇప్పుడు కొత్తగా ఉచిత పథకాలు బంద్ చేయాలి అంటున్నారు. రైతులను ఆదుకోవడం, వితంతువులను ఆదుకోవడం, పింఛన్లు ఇవ్వడం తప్పా. ఎన్డీఏ ప్రభుత్వంలో దందా తయారైంది. మరి NPA ఏంటో కేంద్రం సమాధానం చెప్పాలి? 2014 వరకు 2లక్షల కోట్ల ఎన్పీఏ ఉంటే.. బీజేపీ 8 ఏళ్ల కాలంలో 20లక్షల కోట్లు దాటింది. ఎన్పీఏ పేరుతో బీజేపీ స్కామ్‎కు పాల్పడుతోంది. 20 లక్షల కోట్లకు ఎన్పీఏ పెరిగిందంటే.. అది దేనికి సంకేతం?

మేకిన్ ఇండియా అని చెబుతున్నారు. కానీ, ఫోన్లు, దీపావళి ఒత్తులు, దీపావళి బాంబులు, పీపీఈ కిట్లు, జాతీయ జెండాలు చైనా నుంచి దిగుమతి చేస్తారు, పైగా మేకిన్ ఇండియా అంటారు. అప్పట్లో మేధో సంపత్తి దేశం నుంచి వెళ్లిపోయేవారు, కానీ ఇప్పుడు దేశం నుంచి డబ్బులు కూడా వెళ్లిపోతున్నాయి. లక్షల కోట్లు అప్పు తీసుకొని కార్పొరేట్ దొంగలు విదేశాలకు పారిపోతున్నారు. కాకులను కొట్టి గద్దలకు వేసినట్లు ఉంది. నేను నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం వల్ల దేశం మొత్తం చర్చ జరగాలి.

వజ్రోత్సాల సందర్భంగా 57 ఏండ్లు నిండిన వారికి పింఛన్ ఇవ్వాలని నిర్ణయించాం. దాంతో కొత్తగా 10 లక్షల మందికి లబ్ధి చేరుతుంది. పాతవి 36 లక్షల పింఛన్లు, కొత్తవి కలిపి మొత్తం కొత్త కార్డులిస్తాం. డయాలసిస్ పేషంట్లకు రూ. 2016 పెన్షను ఇస్తాం. 75 మంది ఖైదీలను కూడా విడుదల చేస్తాం. రాష్ట్రంలో ఉన్న అనాధ పిల్లలను రాష్ట్ర పిల్లలుగా ప్రకటిస్తాం. వారి బాధ్యత రాష్ట్రమే చూసుకుంటుంది.

కేంద్రం తక్షణమే పాల మీద జీఎస్టీ ఎత్తేయాలి. చేనేత వాళ్లకు బీమా పెడదామని మేం అనుకుంటుంటే.. కేంద్రం మాత్రం వారి మీద కూడా జీఎస్టీ వేసింది. ఇప్పుడు గాలి మీద తప్ప అన్నింటి మీదా పన్నేసింది. ఎఫ్ఆర్బీఎం కోతలు తీసేయండి, అప్పుడే రాష్ట్రాలు బాగుపడతాయి. మీ నిర్ణయాలు ప్రజా వ్యతిరేకమైతే రాష్ట్రం కోసం, దేశం కోసం మీతో కొట్లాడుతూనే ఉంటా. నా బొందిలో ప్రాణం ఉన్నంతవరకు పోరాటం చేస్తా. వింటే మంచి మాట, వినకుంటే అందరినీ కలుపుకొని ఉద్యమం చేస్తాం. పాత ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను తీసేయాలని మీరు చూస్తున్నారు. మోడీని కోరుతున్నా.. ఇకనైనా మీ తీరు మార్చుకోండి’ అని సీఎం కేసీఆర్ అన్నారు.