కేంద్రంలో ఉన్నది ప్రభుత్వమా.. కిరాణా దుకాణమా?

CM KCR

కేంద్ర ప్రభుత్వం తాను చేయాల్సిన సామాజిక బాధ్యతను విస్మరించి ధాన్యాన్ని కొనలేమని చెప్పడం సిగ్గులేని చర్య అని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం సేకరణ విషయంలో రాద్ధాంతం సృష్టించి దేశంలోని రైతులందరినీ గందరగోళానికి గురి చేస్తోందన్నారు. రూ.లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న కేంద్ర ప్రభుత్వం కిరాణా దుకాణదారుడిలా వ్యవహరిస్తున్నదని ఆయన మండిపడ్డారు. ప్రతి విషయంలోనూ లాభనష్టాలను బేరీజు వేసుకొని మాట్లాడటం సరైంది కాదని.. అందులోనూ రైతుల విషయంలో లాభం గురించి ఆలోచిస్తే.. అది ప్రభుత్వం ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. ఏ ప్రభుత్వమైనా ప్రజా పంపిణీపై సామాజిక బాధ్యత ఉండాలి.కేంద్రం వద్ద నిల్వలు పెరిగితే అందుకు ప్రత్యామ్నాయాలు ఆలోచించే శక్తి కూడా కేంద్ర ప్రభుత్వానికి ఉండాలని ఆయన అన్నారు. ఏదైనా నష్టం వస్తే కేంద్రం భరించాలే తప్ప రాష్ట్రాలపై నెట్టకూడదు. ఇలాంటి నీచమైన కేంద్ర ప్రభుత్వాన్ని నేను ఇంతవరకూ చూడలేదు. ఇకపై చూస్తానని కూడా అనుకోవడం లేదు. పచ్చి అబద్ధాలు ఆడుతూ కేంద్రం దిగజారి ప్రవర్తిస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు.

 

దేశంలో ధాన్యాన్ని సేకరించడం, సేకరించిన ధాన్యాన్ని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు అందించడం, దేశ ఆహార భద్రత కోసం బఫర్‌ స్టాక్‌ నిల్వ చేయాల్సిన బాధ్యత పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదేనని సీఎం కేసీఆర్ అన్నారు. కేంద్రంలో అధికారం చేపట్టిన బీజేపీ ప్రభుత్వం పూర్తిగా రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఆయన మండిపడ్డారు. పూర్తిస్థాయిలో పేదల వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్నారని కేసీఆర్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం అన్నీ రంగాల్లో ఇలాంటి విధానాలనే కేంద్రం అవలంబిస్తోందని కేసీఆర్ ధ్వజమెత్తారు.