ఆల్ ఇండియా స‌ర్వీసెస్ రూల్స్ మార్పు స‌మాఖ్య స్ఫూర్తికి విరుద్ధం: సీఎం కేసీఆర్

CM KCR letter to Modi

కేంద్రం చేప‌ట్టిన ఆల్ ఇండియా స‌ర్వీసెస్(కేడ‌ర్‌) రూల్స్ స‌వ‌ర‌ణ‌పై సీఎం కేసీఆర్ తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. ఈ మేరకు ప్ర‌ధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ రాశారు. ప్ర‌తిపాదిత స‌వ‌ర‌ణ‌లు రాష్ట్రాల హ‌క్కుల‌ను హ‌రిస్తాయ‌ని కేసీఆర్ లేఖ‌లో స్ప‌ష్టం చేశారు.

రాజ్యాంగంలో ఉన్న స‌మాఖ్య స్ఫూర్తికి ప్ర‌తిపాదిత స‌వ‌ర‌ణ‌లు విరుద్ధం అని కేసీఆర్ అన్నారు. ఆల్ ఇండియా స‌ర్వీసుల‌లోని ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్ఎస్ స్వరూపాన్నే స‌వ‌ర‌ణ‌లు మార్చేస్తాయ‌ని.. అందుకే ప్ర‌తిపాదిత స‌వ‌ర‌ణ‌ల‌ను తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నామ‌ని కేసీఆర్ లేఖ‌లో వెల్ల‌డించారు.

ఆల్ ఇండియా స‌ర్వీస్ రూల్స్ స‌వ‌ర‌ణతో కేంద్రం రాష్ట్రాల హ‌క్కుల‌ను హ‌రిస్తుంది. రాష్ట్రాల్లో ప‌నిచేస్తున్న సివిల్ స‌ర్వెంట్లను ప‌రోక్షంగా త‌మ కంట్రోల్‌లోకి తెచ్చుకునే విధంగా కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌పోజ‌ల్ ఉంది. ఇది రాష్ట్ర ప్ర‌భుత్వాల ప‌రిపాల‌న‌లో వేలు పెట్టిన‌ట్టుగా ఉంటుంది. ఏఐఎస్ ఆఫీస‌ర్ల‌ను కేంద్రం త‌మ గుప్పిట్లోకి తెచ్చుకొని వాళ్ల‌ను ఒత్తిడికి గురిచేసేలా స‌వ‌ర‌ణ‌లు ఉన్నాయ‌ని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

ఆల్ ఇండియా స‌ర్వీసెస్ యాక్ట్ 1951ను రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్‌ 312 ప్ర‌కారం పార్ల‌మెంట్ చ‌ట్టం చేసింది. ఆ చ‌ట్టం ఆధారంగా కేంద్రం ప‌లు రూల్స్ ను ప్ర‌వేశ‌పెట్టింది. కానీ.. ఇప్పుడు కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొస్తున్న ఈ స‌వ‌ర‌ణ‌లు మాత్రం కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల మ‌ధ్య ఉన్న రిలేష‌న్‌షిప్‌ను కాల‌రాయ‌డ‌మే. అలా ఏక‌ప‌క్షంగా.. మొండిగా ఆల్ ఇండియా స‌ర్వీసెస్‌లో కేంద్రం స‌వ‌ర‌ణ‌లు చేయ‌డం క‌న్నా.. పార్ల‌మెంట్ ఆమోదంతో స‌వ‌ర‌ణ‌లు చేసే ద‌మ్ము కేంద్రానికి ఉందా? అని సీఎం కేసీఆర్ లేఖలో ప్ర‌శ్నించారు.