‘సిరివెన్నెల’ మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

CM KCR mourns the death of 'Sirivennela'

ప్రముఖ తెలుగు సినీగేయ రచయిత, పద్మశ్రీ చంబోలు (సిరివెన్నెల) సీతారామ శాస్త్రి మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ఎటువంటి సంగీత ప్రక్రియలతోనైనా పెనవేసుకుపోయే అద్భుత సాహిత్యాన్ని సృష్టించిన సిరివెన్నెల, పండిత పామరుల హృదయాలను గెలిచారని సీఎం తెలిపారు.

సినిమా పేరునే తన ఇంటిపేరుగా మార్చుకున్న ఆయన సాహిత్య ప్రస్థానం,  సామాజిక, సాంప్రదాయ అంశాలను స్పృశిస్తూ మూడున్నర దశాబ్దాల పాటు సాగిందని గుర్తు చేసుకున్నారు.

సిరివెన్నెల సీతారామ శాస్త్రి మరణం, తెలుగు చలనచిత్ర రంగానికి, సంగీత సాహిత్య అభిమానులకు తీరని లోటని సీఎం అన్నారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.