చినజీయర్‌ స్వామి ఆశ్రమానికి సీఎం కేసీఆర్.. యాదాద్రి పునఃప్రారంభ ఏర్పాట్లపై చర్చ

CM KCR visits Muchhinthal Chinjiyar Swamy Ashram

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునఃప్రారంభ ఏర్పాట్లపై చర్చించేందుకు సీఎం కేసీఆర్‌.. ముచ్చింతల్‌లోని చినజీయర్‌ స్వామి ఆశ్రమానికి విచ్చేశారు. మార్చి 28న మహా కుంభసంప్రోక్షణం చేపట్టాలని, 21 నుంచి మహా సుదర్శనయాగం నిర్వహించాలని ఇప్పటికే ముహూర్తం ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏర్పాట్లు, ఆహ్వానాలు, సంబంధిత అంశాలపై చినజీయర్‌ స్వామితో సీఎం సమావేశమై చర్చించారు.

ఫిబ్రవరిలో చినజీయర్‌ ఆశ్రమంలో రామానుజాచార్యుల విగ్రహావిష్కరణ, సంబంధిత ఏర్పాట్లపై కూడా సీఎం చర్చించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు పూర్ణకుంభంతో ఆశ్రమ రుత్వికులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆశ్రమంలోని యాగశాలకు వెళ్లారు. ఈసందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు… అక్కడ చేసిన ఏర్పాట్లను చినజీయర్‌ స్వామి వివరించారు. సుదర్శన యాగానికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని సీఎస్‌ సోమేశ్ కుమార్ ను సీఎం ఆదేశించారు.

CM-KCR-visits-Muchhinthal

యాగం సమయంలో నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించిన సీఎం.. స్వయంగా ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘురామారెడ్డికి కేసీఆర్ ఫోన్ చేసి మాట్లాడారు. మిషన్ భగీరథ నీరు కూడా సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. అన్నిశాఖలు ఈ యాగం కోసం సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

యాగం సమయంలో ఫైరింజన్లు అందుబాటులో ఉంచాలన్నారు. దేశ విదేశాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉన్నందున యాగస్థలికి మెరుగైన రోడ్డు సౌకర్యంతోపాటు వసతి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ సంతోష్‌ కుమార్, మైం హోం అధినేత రామేశ్వరరావు ఉన్నారు.

శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకలు

ముచ్చింతల్‌లోని దివ్య సాకేతంలో 2022 ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు జరగబోయే శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకల సంరంభం సందర్భంగా సహస్ర కుండాత్మక లక్ష్మీనారాయణ యాగం నిర్వహించనున్నారు. 1035 హోమగుండాలతో ప్రత్యేక యాగం చేస్తారు. ఇందుకోసం 2 లక్షల కిలోల ఆవునెయ్యితోబాటు ఇతర హోమ ద్రవ్యాలు వినియోగించనున్నారు. సమతాస్ఫూర్తిని చాటుతూ నిర్వహించనున్న రామనుజ సహస్రాబ్ది సంరంభం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది.