పోడు భూముల సమస్య పరిష్కారంపై ఈ నెల 23న సీఎం కేసీఆర్ విస్తృతస్థాయి సమావేశం

CM KCR extends Teachers’ Day greetings

Chief Minister KCR left for Delhi on Friday afternoon

పోడు భూముల సమస్య పరిష్కారం, అడవుల పరిరక్షణ, హరిత హారం ప్రధాన అంశాలుగా ఈ నెల 23న జిల్లా కలెక్టర్లు, అటవీ శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఉదయం 11.30 నుండి విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు.  ఒకరోజు సాంతం సుదీర్ఘంగా జరిగే సమావేశంలో అటవీ ప్రాంతాల్లో పోడు వ్యవసాయం చేస్తున్న ఆదివాసీలు, గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను సానుభూతితో పరిష్కరించడంతో పాటు అడవి తరిగిపోకుండా ఉండేందుకు కావలసిన అన్ని చర్యల గురించి చర్చించి సమగ్ర కార్యాచరణను రూపకల్పన చేస్తారు. హరిత హారం ఫలితాలను అంచనావేస్తూ మరింత విస్తృతస్థాయిలో ఫలితాలను రాబట్టడం కోసం చేపట్టవలసిన భవిష్యత్ కార్యచరణపై సమావేశంలో చర్చిస్తారు.

ఈ సమావేశంలో అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, పంచాయతిరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు,  సంబంధిత శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులు, అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా కన్జర్వేటర్లు, డిఎఫ్ఓ లతో పాటు, ఐటిడిఎ ప్రాజెక్టు అధికారులు తదితరులు పాల్గొంటారు.

ఈనెల 20, 21, 22 తేదీలలో పోడు భూముల సమస్యను అధ్యయనం చేయడం కోసం క్షేత్ర స్థాయి వాస్తవాలను తెలుసుకోవడానికి అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ ఛోంగ్తు, పిసిసిఎఫ్ శ్రీమతి శోభలతో కూడిన అధికార బృందం హెలికాప్టర్ లో సంబంధిత అటవీ ప్రాంతాలను సందర్శించి క్షేత్రస్థాయి పరిశీలన చేపడతారు.