ప్రజలంతా ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో ఉండాలి : సీఎం కేసీఆర్

kcr

ప్రజలంతా ఆరోగ్యంగా, సుఖ సంతోషాలతో జీవించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షించారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్దతో కృషి చేస్తున్నదని సీఎం అన్నారు. ప్రజావైద్యం, ఆరోగ్య రంగాలలో తెలంగాణ రోజురోజుకు పురోగతిని సాధిస్తున్నదని ఆయన తెలిపారు. రాష్ట్ర నలుమూలలా వైద్య రంగంలో గణనీయమైన పురోగతి సాధిస్తుండడం ప్రజల ఆరోగ్యం మీద రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్దికి, దార్శనికతకు అద్దం పడుతున్నాయన్నారు. ఇప్పటికే ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ప్రజారోగ్య పరిరక్షణ కోసం వైద్య రంగాభివృద్ధి కోసం బడ్జెట్ కేటాయింపులను భారీగా పెంచిందన్నారు.

gandhi hospital
ప్రభుత్వ వైద్యారోగ్య రంగాన్ని మరింతగా పటిష్టపరిచేందుకు మానవ వనరుల పెంపునకు చర్యలు చేపట్టామని సిఎం అన్నారు. వైద్యశాఖలో 21,073 పోస్టులు కొత్తగా మంజూరు చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా సూపర్ స్పెషలిటీ హాస్పిటల్స్ నిర్మాణం, జిల్లాకో మెడికల్ కాలేజీ, అనుబంధంగా నర్సింగ్ కాలేజీల నిర్మాణం, ఎంసీహెచ్ కేంద్రాలు, యూజీ, పీజీ, సూపర్ స్పెషలిటీ వైద్య సీట్ల పెంపు, నర్సింగ్ కాలేజీ సీట్ల పెంపుతో తెలంగాణలో ప్రభుత్వ వైద్య సేవలను విస్తృతపరుస్తున్నామన్నారు సీఎం కేసీఆర్. ప్రజలవద్దకే వైద్యం అనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాలు విజయవంతంగా ప్రజాదరణ పొందుతున్నాయన్నారు. అదే స్పూర్తితో తెలంగాణ వ్యాప్తంగా ఏర్పాటయిన పల్లె దవాఖానల్లో ప్రజలందరికీ సేవలందుతున్నాయని చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలో 350 బస్తీ దవాఖానల ద్వారా 81 లక్షల మందికి, 2,250 పల్లె దవాఖానల ద్వారా 19.61 లక్షల మందికి వైద్య సేవలను అందిస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు.