ఆగని గ్యాస్ ధరల పెంపు.. తాజాగా సీఎన్జీపై మరో రూ. 2 పెంపు

దేశంలో గ్యాస్ ధరల పెంపు ఆగడం లేదు. రెండు రోజుల క్రితం గృహావసరాలు, కమర్షియల్‌ ఎల్పీజీ సిలిండర్‌ ధరలు పెరగగా.. తాజాగా సీఎన్జీ వంతు వచ్చింది. దాంతో వారం రోజులు గడవకముందే సీఎన్జీ ధరలు మరోసారి పెరిగాయి. గత వారం సీఎన్జీ గ్యాస్ పై రూ.2 వడ్డించగా, ఈ రోజు మరో రూ.2 భారం మోపారు. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో కిలో సీఎన్జీ ధర రూ.75.61కి చేరింది.

ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ శనివారం కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ ధరను కిలోకు రూ. 2 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ ధర నేటి నుంచే అమలులోకి వస్తుందని కంపెనీ తెలిపింది. నోయిడా, గ్రేటర్ నోయిడా మరియు ఘజియాబాద్‌లలో సీఎన్జీ ధర కిలోకు రూ. 78.17కి పెరిగింది. ఇక గురుగ్రామ్‌లో అయితే కిలో సీఎన్జీ ధర రూ. 83.94కు చేరింది. రేవారీలో రూ. 86.07పైసలు, అజ్మీర్‎లో రూ. 85. 88 పైసలు, కాన్పూర్, ఫతేపూర్‎లో గరిష్టంగా రూ. 87.40 పైసలకు చేరింది.