బిపిన్ రావత్ హెలీకాప్టర్ ప్రమాద ఘటనపై నివేదిక సమర్పించిన కమిటీ

Bipin Rawat Helicopter crash

సీడీఎస్, జనరల్ బిపిన్ రావత్ హెలీకాప్టర్ ప్రమాద ఘటనపై త్రివిధ దళాల కమిటీ నివేదిక సమర్పించింది. డిసెంబర్ 8న ఆయన ప్రయాణిస్తున్న ఎంఐ-17వీ5 హెలీకాప్టర్ తమిళనాడులోని కూనూరు సమీపంలో ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై విచారణకు కేంద్రం ఓ కమిటీని వేసింది.

ఫ్లైట్ డాటా రికార్డర్, కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ సహా ప్రత్యక్ష సాక్షులను సైతం కమిటీ విచారణ జరిపింది. సాంకేతిక లోపం లేదని, కుట్ర కోణం కూడా లేదని కమిటీ తేల్చింది. అలాగే పైలట్ నిర్లక్ష్యం కూడా లేదని కమిటీ తన నివేదికలో స్పష్టం చేసింది.

వాతావరణంలో అనూహ్య మార్పుల కారణంగా హెలీకాప్టర్ దట్టమైన మేఘాల్లోకి ప్రవేశించడం వల్లనే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని కమిటీ అంచనాకు వచ్చింది. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చూసేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఈ సందర్భంగా కమిటీ పలు సిఫార్సులు చేసింది. వాటిని సమీక్షించి, తగిన నిర్ణయం తీసుకుంటామని వాయుసేన తెలిపింది.