కర్లీ హెయిర్ ని కాపాడే కండిషనర్లు.. ఓ లుక్కేయండి

నల్లగా నిగనిగలాడే ఉంగరాల జుట్టు చూస్తే భలే ముచ్చటేస్తుంది. చాలామంది తమ జుట్టు కూడా అలా ఉంటే బాగుండు అనుకుంటారు. కానీ.. అది అందరికీ సాధ్యం కాదు. అయితే.. కర్లీ హెయిర్ ఉన్నవారు మాత్రం ఆ జుట్టును ఎలా కాపాడుకోవాలి? వాటి పోషణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం తెలియక సతమతమవుతూ ఉంటారు. చూసేందుకు ఎంత ఆకర్షణీయంగా ఉంటుందో.. దాన్ని అంతే అందంగా కనిపించడం కోసం హ్యాండిల్ చేయడం కూడా అంతే కష్టం. చిక్కులు పడకుండా అందంగా కనిపించే ఉంగరాల జుట్టు కోసం ఎలాంటి కండిషనర్లు వాడాలో సూచిస్తున్నారు సౌందర్య నిపుణులు. అవేంటో ఓ లుక్కేద్దామా..


గుడ్డు, ఆలివ్ ఆయిల్ కండీషనర్
రింగుల జుట్టుకు గుడ్డు మంచి కండిషనర్. ఇందులో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. గుడ్డు సెబమ్ ఉత్పత్తిని పెంచి, జుట్టును తేమగా మార్చడానికి సహాయపడుతుంది. ఆలివ్ ఆయిల్ జుట్టును హైడ్రేట్ గా ఉంచడంలో తోడ్పడుతుంది. ఈ రెండు పదార్థాలు జుట్టును మృదువుగా చేస్తాయి. ఈ కండీషనర్ చేయడానికి, ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ నూనెలో గుడ్డు కలిపి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి షవర్ క్యాప్ వేసుకుని 10 నిమిషాల పాటు ఆరనివ్వండి. తర్వాత షాంపూ స్నానం చేస్తే సరి.

కొబ్బరి పాలు, తేనె కండీషనర్
మృదువైన ఎగిరి పడే గిరజాల జుట్టుకు కొబ్బరిపాలు, తేనె కలిపిన కండీషనర్ చాలా మేలు చేస్తుంది. డ్యామేజ్ అయిన వెంట్రుకలను సరిచేయడానికి కొబ్బరి పాలు మంచి పోషకం. తేనె జుట్టును మృదువుగా, తేమగా చేస్తుంది. ఈ ఈ కండీషనర్ తయారు చేయడానికి.. ఒక కప్పు కొబ్బరిపాలలో 4 టేబుల్ స్పూన్ల తేనె కలపండి. జుట్టుకు షాంపూతో తలస్నానం చేసిన తర్వాత ఆ మిశ్రమాన్ని జుట్టుకి పట్టించి 10 నిమిషాల పాటు అలాగే ఉంచండి. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.


ఆముదం, గుడ్డు కండీషనర్
జుట్టు పెరుగుదలకు ఆముదం చాలా మేలు చేస్తుంది. జుట్టు రాలడాన్ని అరికడుతుంది. గుడ్డులోని ప్రోటీన్లు, అమైనో ఆమ్లాలు జుట్టు సహజ నూనెలను కాపాడుతుంది. జుట్టు బౌన్సీగా, ప్రకాశవంతంగా ఉండేందుకు సహాయపడుతుంది. ఇందుకోసం ఒక గుడ్డులో ఒక టేబుల్ స్పూన్ ఆముదం కలిపి బాగా గిల కొట్టండి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని పొడి జుట్టు మీద అప్లై చేసి షవర్ క్యాప్ పెట్టండి. గంట తర్వాత షాంపూతో తలస్నానం చేయండి.


నిమ్మరసం, ఆలివ్ ఆయిల్, కొబ్బరి పాలు
ఆలివ్ ఆయిల్, కొబ్బరి పాలు జుట్టుకు బలాన్ని, అందాన్ని ఇస్తాయి. ఈ రెండింటి మిశ్రమం జుట్టును తేమగా ఉంచడంలో సహాయపడుతుంది. నిమ్మరసం జుట్టు చిక్కు సులభంగా వదిలిపోయేలా, జుట్టులోని జిడ్డు, దుమ్మును తొలగించేస్తుంది. ఈ హెయిర్ కండీషనర్ చేయడానికి 2 టీస్పూన్ల నిమ్మరసం, 2 టీస్పూన్ల ఆలివ్ ఆయిల్, టేబుల్ స్పూన్ కొబ్బరి పాలు కలిపి మిశ్రమంలా చేయండి. ఈ మిశ్రమాన్ని పొడి జుట్టు మీద అప్లై చేసి 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి.