అన్నాడీఎంకేలో ఆధిపత్య పోరు.. పన్నీర్‌సెల్వంపై దాడి!

అన్నాడీఎంకేలో ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. గురువారం జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో పన్నీర్‌సెల్వం, ఎడప్పాడి పళనిస్వామి వర్గాల మధ్య వివాదం కలకలం రేపింది. పార్టీలో ఏక నాయకత్వాన్ని కోరుకుంటోన్న పళనిస్వామికి సీనియర్‌ నేతలు మద్దతు తెలపడంతో పన్నీర్‌సెల్వం వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. ఇదే సమయంలో వేదికపైకి చేరుకున్న పన్నీర్‌సెల్వంపై పళనిస్వామి మద్దతుదారులు నీళ్ల బాటిళ్లతో దాడికి యత్నించడం ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో పార్టీ సమావేశం మళ్లీ రసాభాసగా మారింది.

గతంలో ప్రతిపాదించిన తీర్మానాలను ఆమోదించేందుకు అన్నాడీఎంకే పార్టీ సర్వసభ్య సమావేశం ఇవాళ మరోసారి భేటీ అయ్యింది. ఇదే సమయంలో అగ్రనేతలు ఈపీఎస్‌, ఓపీస్‌లు తమ మద్దతుదారులతో అక్కడికి చేరుకున్నారు. ఇరువర్గాల నినాదాలు, అరుపుల మధ్యే తీర్మానాలను చదవడం మొదలుపెట్టారు. అదే సమయంలో వేదికపైకి చేరుకున్న పన్నీర్‌సెల్వంపై కొందరు వాటర్‌ బాటిళ్లను విసిరారు. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆయనను బయటకు తీసుకెళ్లిపోయారు.

తమిళనాడు మాజీ సీఎం జయలలిత మరణం తర్వాత పార్టీ నాయకత్వం విషయంలో పార్టీలో విభేదాలు తీవ్రమయ్యాయి. ముఖ్యంగా పళనిస్వామి పార్టీ జనరల్‌ సెక్రటరీగా ఎన్నికయ్యేందుకు గతకొన్ని రోజులుగా పావులు కదుపుతున్నారు. మరోవైపు పన్నీర్‌సెల్వం మాత్రం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా ఎంజీఆర్‌, జయలలిత వంటి అగ్రనేతలతో పనిచేసిన వారికి పార్టీలో ప్రాధాన్యత కల్పిస్తూ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఈ క్రమంలో పార్టీలో ఇప్పటివరకు ఉన్న ద్వంద్వ నాయకత్వాన్నే కొనసాగించాలని పట్టుబడుతున్నారు.