కాంగ్రెస్, బీజేపీలవి నీతి తప్పిన రాజకీయాలు: మంత్రి కొప్పుల ఈశ్వర్

Minister Koppula Ishwar press meet

Minister Koppula Ishwar press meet

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, హుజురాబాద్ లో గెలిచిన ఈటెల రాజేందర్ నిన్న, మొన్న చేసిన అనుచిత వ్యాఖ్యలను మంత్రి  కొప్పుల ఈశ్వర్ ఖండించారు. ఎంపీ వెంకటేష్ నేత, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావులతో కలిసి టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

దళిత బంధు వెంటనే అమలు చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేయడం హాస్యాస్పదం. దళిత బంధు దేశం లొనే కేసీఆర్ ఆలోచనతో తెలంగాణ లో మొదలైన పథకం. దళిత బంధు అమలు మొదలయింది.. ఎన్నికల సమయంలో బీజేపీ పిర్యాదు వల్లే ఆగింది.  బీజేపీ చెబితేనో.. బండి సంజయ్ చెబితేనో మొదలు పెట్టిన పథకం కాదు. బండి సంజయ్ కు ఏం అర్హత ఉంది.. దళిత బంధుపై మాట్లాడటానికి? కేంద్రం నుంచి దళితులకు ఏం తెస్తారో బండి సంజయ్ చెప్పాలని డిమాండ్ చేశారు.

దమ్ముంటే బండి సంజయ్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళిత బంధు లాంటి పథకం పెట్టించాలి. బీజేపీ నేతలు అబద్దాలతో మభ్యపెడుతున్నారు. దళితులను మోసం చేస్తున్న పార్టీ బీజేపీ. హుజురాబాద్ లో ఏక్కడ లేని విధంగా బీజేపీ ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేసింది. ముందు ఆ మేనిఫెస్టో ను అమలు చేసేందుకు బండి సంజయ్ కేంద్రం తో కొట్లాడాలి. ఉపఎన్నికలకు మేనిఫెస్టో విడుదల చేస్తారా. ఉన్నత వర్గాలకు ఆదానీ, అంబానీలు పెద్ద పీట వేసే పార్టీ బీజేపీ అయితే పేదల కోసం పని చేసే పార్టీ టీఆర్ఎస్. బీజేపీ ఎంపీ అరవింద్ ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధ చట్టాన్ని లొట్టపీసు చట్టం అంటూ హేళన చేశారు. దళిత జాతిని అవమాన పరిచిన ఎంపీ బీజేపీ లో ఉన్నారు. దళితులంటే అరవింద్ కు చిన్నచూపా. కాంగ్రెస్ బీజేపీలు బాహాటంగా సహకరించుకోవడం వల్లే హుజురాబాద్ లో ఓటమి పాలయ్యామన్నారు.

హుజురాబాద్ లో మా ఓటు బ్యాంకు చెక్కు చెదరలేదు. బీజేపీ దేశ వ్యాప్తంగా 32 ఉప ఎన్నికలు జరిగితే ఒక ఎంపీ, 8 అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే గెలిచింది. కాంగ్రెస్ తో అనైతిక పొత్తు తో గెలిచిన రాజేందర్ విర్రవీగి మాట్లాడుతున్నారు. రాష్ట్ర నాయకుడిలా రాజేందర్ మాట్లాడుతున్నారు. రాజేందర్ రాష్ట్ర మంతా తిరిగితే బండి సంజయ్, లక్ష్మణ్ ఏం కావాలి. అసలు రాజేందర్ చివరి దాకా బీజేపీ లో ఉంటారా అనేది అనుమానమే. రాజేందర్ ఆయానంతట ఆయనే టీఆర్ఎస్ ను వీడి వెళ్లారు. ఎక్కువగా ఊహించుకుని రాజేందర్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

హుజురాబాద్ ఫలితంపై పార్టీలో తప్పక సమీక్ష చేసుకుంటాం. ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ళ గడువు ఉంది. హుజురాబాద్ లో మా ఓటమి కి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు సంబంధం లేదు. అక్కడ ప్రత్యేక పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు మానాలి. పెట్రోల్, డీజిల్ ధరలు వంద రూపాయలు దాటించి కేవలం ఐదు రూపాయ లు కేంద్రం తగ్గిస్తే ఫలితం ఏమిటీ. బీజేపీ నేతలు అబద్దాలు మాని కేంద్రం ద్వారా రాష్ట్రానికి ఉపయోగ పడే పనులు చేయాలి. బీజేపీ నేతలు ఏం చేయరు.. కానీ చేసే వారిని విమర్శిస్తారు. కాంగ్రెస్ పార్టీ లో హుజురాబాద్ ఫలితం చిచ్చు రేపుతోంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్.. ఈటలతో కుమ్మక్కు కావడాన్ని కాంగ్రెస్ సినియర్లే తప్పు పడుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ ల నీతి బాహ్యపు రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారు. టీఆర్ఎస్ కు ఉపఎన్నికలు, విజయాలు, అపజయాలు కొత్తకాదన్నారు.